Saturday, April 20, 2024

ప్రజారోగ్యం అప్రమత్తంగా ఉండాలి.. కె.యస్ జవహర్ రెడ్డి

మచిలీపట్నం : రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్, వడ దెబ్బ తదితర ప్రజారోగ్య అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఉదయం వెలగపూడిలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి స్వయం సహాయక బృందాల లక్ష్యాలు, ఆరోగ్యం సంక్షేమ, శిశు సంక్షేమం, ప్రభుత్వ పథకాలను స్వయం సహాయక బృందాలకు తెలియజేయడం, గ్రామ, వార్డు సచివాలయాలు, స్పందన అర్జీల పరిష్కారం, గడపగడపకు మన ప్రభుత్వం తదితర అంశాల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఇన్ఫ్లూయంజా వైరస్, వడదెబ్బ తీవ్రతపై కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన సూచనల మేరకు అన్ని జిల్లాలలో అప్రమత్తంగా ఉండాలన్నారు. తక్షణం వారం రోజులపాటు ఫీవర్ సర్వే చేపట్టాలని ఈ సందర్భంగా సీఎస్ సూచించారు. వడ దెబ్బకు గురికాకుండా ప్రజల్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లాలోని డీఎంహెచ్​వోలకు కలెక్టర్లు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని స్వచ్ఛంద సేవా సంస్థల్ని వినియోగించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి కృష్ణ బాబు సూచించారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రజలు బయట తిరగకుండా ఉండాలని హెచ్చరికలు జారీ చెయ్యాలన్నారు.

అలాగే మార్చి 15వ తేదీ నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. అదేరోజు ఒక విలేజ్‌ క్లినిక్‌ వద్ద ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ పైలట్‌ ప్రాజెక్టులో ఇప్పటివరకూ 45,90,086 మందికి ఆరోగ్య సేవలు ప్రభుత్వం అందించిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సర్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో 1,149 పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయిలో వైద్యుల నియమాకాలను పూర్తి చేశామని, దీర్ఘకాలిక సెలవుల సమయంలో సేవలకు అంతరాయం లేకుండా ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలమేరకు సీహెచ్‌సీల్లో ఉన్న వైద్యులను ఇక్కడ వినియోగించుకుంటామని, దీనికోసం అదనపు నియామకాలకు కూడా చేశామని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ… కృష్ణా జిల్లాలో ఈనెల 14న నిర్వహించనున్న డీ వార్మింగ్ డే (జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం) ను విజయవంతం చేసేందుకు 1 నుంచి 19 సంవత్సరాలు మధ్య వయసు గల ప్రతి ఒక్కరూ నులిపురుగుల మాత్రలను వేసుకునేలా సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేసేలా ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్లలో విద్యార్థులందరికీ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు జిల్లాలో నిర్దేశించిన సుమారు ఆరు లక్షల మందికి ఈ మాత్రలు అందించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజితా సింగ్, డి ఎం హెచ్ ఓ డాక్టర్ గీతాబాయి, డిఇఓ తాహెరా సుల్తానా, మెప్మా, డి ఆర్ డి ఎ పిడి పి.ఎస్. ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ సత్యనారాయణ రాజు, వ్యవసాయ శాఖ అధికారి మనోహర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement