Tuesday, April 16, 2024

Delhi: విశాఖ స్టీల్ ప్లాంటుకు వర్కింగ్ కేపిటల్ అందించండి.. సింధియాకు జీవీఎల్ వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం పూర్తిస్థాయి పనితీరు కోసం వర్కింగ్ క్యాపిటల్ సమస్యను పరిష్కరించాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన కార్యాలయంలో కలిసిన జీవీఎల్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖ స్టీల్ ప్లాంట్) ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గత ఏడాది రూ.913 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన స్టీల్ ప్లాంట్, ప్రస్తుత సంవత్సరంలో వర్కింగ్ మెటీరియల్ అందుబాటులో లేకపోవడం, అధిక ముడిసరుకు ధర, ప్రతికూల మార్కెట్ వంటి పరిస్థితుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని వివరించారు.

అలాగే స్టీల్ ప్లాంట్‌లో ఖాళీగా ఉన్న కీలకమైన డైరెక్టర్-ఫైనాన్స్ పదవిని భర్తీ చేయాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తన లేఖలో పేర్కొన్నారు. బలమైన, శక్తివంతమైన, లాభదాయకమైన విశాఖ స్టీల్ ప్లాంట్, కేవలం విశాఖ నగరానికి మాత్రమే కాదని, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్థంభం వంటిదని చెప్పారు. వర్కింగ్ క్యాపిటల్ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ముడిసరుకును మంత్రిత్వ శాఖ ముందస్తుగా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తుందని కేంద్ర మంత్రి బదులిచ్చారు.

సీ-ప్లేన్ సదుపాయం కల్పించండి
ఉక్కుశాఖతో పాటు పౌరవిమానయాన శాఖ మంత్రిగానూ ఉన్న జ్యోతిరాదిత్య సింధియాతో ఆ రంగానికి సంబంధించిన అంశాలపై కూడా ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడారు. విశాఖపట్నం-విజయవాడ, కాకినాడ, భీమవరం మధ్య ఆర్‌సిఎస్-ఉడాన్ పథకం కింద సీప్లేన్ కార్యకలాపాలు చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరారు. ఉడాన్ పథకం కింద సీప్లేన్ సేవలు, కార్యకలాపాలను మంజూరు చేయడానికి చొరవ తీసుకోవాలని, రాష్ట్రంలో సీప్లేన్ కార్యకలాపాలకు మంచి అవకాశాలున్నాయని వివరించారు.

ఈ సీప్లేన్ మార్గాలను మంజూరు చేయాలని, అవసరమైన నిధులు, ఆపరేటర్ల నుంచి టెండర్లు పిలవాలని ఎంపీ జీవీఎల్ మంత్రిని కోరారు. జీవీఎల్ అభ్యర్థనపై మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందిస్తూ, తమ మంత్రిత్వ శాఖ ఇటీవల 25 మార్గాలను మంజూరు చేసిందని, తదుపరి బ్యాచ్ ఆమోదంలో ప్రతిపాదిత కొత్త మార్గాల ఆమోదాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement