Thursday, December 5, 2024

AP | రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ ఆస్తులకు రక్షణ

రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలకు, ధర్మ సత్రాలకు ఉన్న ఆస్తులను రక్షించే బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చే ప్రతి ఆస్తి రికార్డునీ పరిశీలించి, సదరు ఆస్తుల పరిరక్షణకు తగిన కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు.

సుమారుగా 60 వేల ఎకరాల మేర ఎండోమెంట్స్ ఆస్తులు అన్యాక్రాంతం కావడమో, ఆక్రమణకు గురి కావడమో జరిగిందని తెలుస్తోందన్నారు. అన్యాక్రాంతమైనవీ, ఆక్రమణల్లో ఉన్నవీ గుర్తించి జాబితా సిద్ధం చేసి, చట్టప్రకారం వాటిని కాపాడాలని స్పష్టం చేశారు.

వక్ఫ్ ఆస్తుల రక్షణ తరహాలోనే దేవాదాయ శాఖ ఆస్తులను కాపాడేందుకు ఒక కార్యాచరణ చేపట్టే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఏలూరు జిల్లా ఐ.ఎస్.జగన్నాథపురంలో దీపం 2 పథకం ప్రారంభానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు, అధికారులు, ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఆలయంలో జరుగుతున్న సుదర్శన నరసింహ ధన్వంతరి గరుడ ఆంజనేయ సుబ్రమణ్య అనంత హోమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేవాదాయశాఖ కమిషనర్ శ్రీ సత్యనారాయణ, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ, ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ శ్రీ కొమ్మి శివప్రతాప్, జాయింట్ కలెక్టర్ శ్రీమతి ధాత్రి రెడ్డిలతో సమావేశమయ్యారు.

- Advertisement -

కొండ తవ్వకానికి అనుమతులు ఉన్నాయా?

ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ అధికారులతో మాట్లాడుతూ… ఐ.ఎస్.జగన్నాథపురంలోని ఆలయానికి 50 ఎకరాల వరకూ భూములు ఉన్నాయి… వాటి రక్షణకు ఏ చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఇక్కడ ఉన్న కొండ తవ్వకాలు చేపట్టడంపై వివరణ అడిగారు.

ఇక్కడ తవ్వకాలు చేసిన గ్రావెల్ ఏ విధంగా వినియోగించారు, తవ్వకానికి అనుమతులు ఉన్నాయా, ఉంటే నిర్దేశించిన ప్రాంతంలోనే తవ్వకాలు చేశారా? పరిధులు దాటి తవ్వారా అనేది విచారించాలని ఆదేశించారు. అటవీ, దేవాదాయ భూముల్లో కూడా ఏమైనా తవ్వకాలు చేపట్టారా అనేది కూడా పరిశీలన చేయాలని… ఇందుకోసం సంబంధిత శాఖలన్నీ కలసి విచారణ చేయాలని స్పష్టం చేశారు.

వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆస్తుల రక్షణపై దృష్టిపెట్టాలని, ఆక్రమణలో ఉన్నవెన్ని, అన్యాక్రాంతమైనవి ఎన్ని అనే వివరాలు తెలియచేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ కు దిశానిర్దేశం చేశారు.

సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థినులకు రక్షణ

కూటమి ప్రభుత్వం విద్యార్థినులు, యువతులు, మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇస్తుంది. ఆడ బిడ్డలను ఇబ్బందిపెట్టేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దనీ, సామాజిక మాధ్యమాల్లోనూ, చదువుకొనే చోట, పని ప్రదేశాల్లో వారి రక్షణకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థినులకు పటిష్టమైన రక్షణ చర్యలు కల్పించాలని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ బాధ్యత తీసుకొని రక్షణ ఏర్పాట్లపై సమీక్షించాలని స్పష్టం చేశారు. అదే విధంగా హాస్టళ్లలో బాత్రూమ్స్ లేక ఆడ బిడ్డలు ఇబ్బందిపడుతున్నారని, వాటి నిర్మాణంపై దృష్టిపెట్టాలి అని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల శాసన సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement