Tuesday, October 3, 2023

సీజనుకు ముందే రైతులకు సమస్యలు.. ప్రారంభం కాని భూసార పరీక్షలు

అమరావతి, ఆంధ్రప్రభ : అన్నదాతకు పెట్టుబడి వ్యయం తగ్గాలి… దిగుబడి రెండింతలు పెరిగి నికర ఆదాయం పెరిగేలా రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. విత్తనం నుంచి ఉత్పత్తుల కొనుగోలు వరకు ఆర్బీకేలు రైతును చేయిపట్టుకుని నడిపిస్తాయని చెబుతున్నారు. ఆచరణలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి ప్రయోగశాలలో పరీక్షించి ఫలితాలు విశ్లేషించి రైతులకు సూచనలు ఇస్తామని ప్రకటించినా జూన్‌ నెల వచ్చినా ఆచరణలో అడుగు ముందుకు పడలేదు.

ఒక్కొక్క ఆర్బీకే పరిధిలో వందల నమూనాలు సేకరిస్తామని ప్రకటించినా చివరికి పదుల సంఖ్యకే పరిమితం చేశారు. ఏప్రిల్‌, మే నెలల్లో పొలాల నుంచి మట్టి నమూనాలు సేకరించి ప్రయోగాలు చేయాల్సి ఉన్నా వివిధ కారణాలతో ఇప్పటికీ ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. జూన్‌ నెల రావడంతో ఖరీఫ్‌ సీజన్‌ పనులు ప్రారంభమవుతున్నా మట్టి పరీక్షలపై స్పష్టత లేదు.. దీంతో రైతులు ప్రైవేటు ప్రయోగశాలలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. నియోజకవర్గానికి ఒక ప్రయోగశాలను వ్యవసాయ శాఖ ప్రారంభించినా అవి పూర్తి స్థాయిలో రైతులకు సేవలు అందించలేక పోతున్నాయి.

- Advertisement -
   

రైతులకు లభించని మిర్చి విత్తనాలు..

రాష్ట్రంలో మిర్చి ప్రధాన వాణిజ్య పంట. లక్ష హెక్టార్లకు పైగా మిర్చి సాగవుతుంది. మిర్చికి నల్లతామర ఆశించడంతో గతేడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని రకాల విత్తనాలు నల్లతామర పురుగుకు తట్టుకుంటున్నాయని ప్రచారం జరగడంతో ఆయా కంపెనీల విత్తనాలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. రైతులు రెండు నుంచి మూడు కంపెనీల విత్తనాలు కావాలని కోరుతున్నారు. డిమాండ్‌ మేరకు మార్కెట్‌లో విత్తన లభ్యత లేకపోవడంతో రైతులు అధిక ధర వెచ్చించి నల్లబజారులో కొనుగోలు చేస్తున్నారు. జడ్పీ సర్వసభ్య సమావేశంలోనూ రైతులు కోరుతున్న విత్తనాలు అందుబాటులో ఉంచాలని నేతలు కోరినా ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.

నామమాత్రంగా ఆర్బీకేల్లో అందుబాటులోకి తెచ్చినా పది శాతం మందికి కూడా అందని పరిస్థితి. రైతులు కోరిన విత్తనం కోసం పొరుగు రాష్ట్రాల్రకు వెళ్లి తెచ్చుకోవడం, ఇక్కడే అధిక ధర చెల్లించి నల్లబజారులో కొనుగోలు చేసి సమకూర్చుకుంటున్నారు. విత్తన డిమాండ్‌ను అంచనా వేసి అందుకు అనుగుణంగా ప్రణాళికతో విత్తన నిల్వలు ఉండేలా చూసినట్లయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు.

పత్తి విత్తనాలకు సంబంధించి గరిష్ఠ చిల్లర ధర కంటే తక్కువకే మార్కెట్‌లో లభిస్తుండడంతో రైతులు వ్యాపారుల వద్దే కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు కల్తీ విత్తనాలు రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. కోరిన విత్తనం దొరికితే చాలన్న భావనలో ఉన్న రైతులు బిల్లులు అడిగితే విత్తనాలు ఇవ్వరన్న ఉద్దేశంతో వ్యాపారులపై నమ్మకంతో తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నాణ్యత లేని విత్తనాలతో రైతులు నష్టపోతున్న ఘటనలు పునరావృతమవుతున్నాయి.

కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరం

గత ఖరీఫ్‌ సీజన్‌లో మిర్చి పంటకు నల్లతామర పురుగు ఆశించింది. ఉద్ధృతి ఎక్కువగా ఉన్న పంటను రైతులు తొలగించి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, శనగ సాగు చేశారు. రైతులు అప్పటివరకు మిర్చికి పెట్టిన పెట్టు-బడి మొత్తం కోల్పోయారు. అప్పట్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన శాత్తలు, ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు రైతులు తొలగించిన పంటను ప్రత్యక్షంగా చూశారు. నల్లతామర పురుగుకు రసాయనాలు పిచికారీ చేసి కాపాడుకున్న రైతులకు దిగుబడులు బాగున్నా.. పంటను కాపాడుకోలేక తొలగించిన వారు మాత్రం నష్టపోయారు. కౌలుకు తీసుకుని సాగు చేసిన మిర్చి రైతులు మరింత కుంగిపోయారు. వీరికి ఇప్పటివరకు ఎలాంటి భరోసా లభించకపోవడం గమనార్హం.

రాయితీ సొమ్ము కోసం నిరీక్షణ..

వ్యవసాయ యంత్రసేవా పథకంలో భాగంగా రైతు భరోసా కేంద్రాల పరిధిలో బృందాలుగా ఏర్పడితే వారికి రాయితీ యంత్రాలు మంజూరు చేస్తున్నారు. ఇందులో 50 శాతం సొమ్ము రైతులు చెల్లిస్తే మరో 50 శాతం బ్యాంకులు రుణంగా అందిస్తున్నాయి. యంత్ర పరికరాలకు సంబంధించి వంద శాతం సొమ్ము సమకూరిన తర్వాతే ఆయా కంపెనీలు పరికరాలను రైతులకు సరఫరా చేస్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం రాయితీ సొమ్ము రైతు ఖాతాకు జమ చేస్తోంది.

గతేడాది జూన్‌ 7న రైతుల ఖాతాకు రాయితీని ప్రభుత్వం జమ చేసింది. అప్పట్లో వివిధ సాంకేతిక కారణాలతో ఆ రోజు నాటికి రాయితీ జమకాని రైతులు ఇప్పటివరకు ఎదురుచూడాల్సి వచ్చింది. గతంలో రాయితీ సొమ్ము పోగా మిగిలినది చెల్లిస్తే పరికరాలు అందించేవారు. ప్రభుత్వం నేరుగా ఆయా కంపెనీలకు రాయితీ సొమ్ము చెల్లించేది. దీంతో రాయితీ సొమ్ము జమ చేయడం ఆలస్యమైనా రైతులకు ఇబ్బంది ఉండేదికాదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement