Saturday, April 20, 2024

Delhi: ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యం.. బుద్దిస్ట్ సర్క్యూట్‌తో పర్యాటకాభివృద్ధి : వైసీపీ ఎంపీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేవాలయాల అభివృద్ధి తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు తెలిపారు. బుధవారం న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆ పార్టీ ఎంపీలు సత్యవతి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, గురుమూర్తి కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హిందూమతానికి వ్యతిరేకి అని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

ప్రషాద్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన 380 కోట్ల రూపాయల్లో ఇప్పటి వరకు 110 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారని ఆయన తెలిపారు. మిగిలిన 270 కోట్ల రూపాయలను కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీ సత్యవతి మాట్లాడుతూ… పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన పెండింగు అంశాలపై అవకాశం వచ్చినప్పుడల్లా కేంద్రమంత్రుల దృష్టికి తీసుకువెళుతున్నామని చెప్పారు. స్వదేశీ దర్శన్ పథకం కింద ఏపీలో శాలిగుండం, బొబ్బకొండ ఉన్నాయన్నారు.

ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి లేదన్న కారణంగా కేవలం 22 కోట్ల 98 లక్షలను మాత్రమే విడుదల చేశారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 38కోట్ల 38 లక్షలు రాష్ట్రానికి విడుదల చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కోరామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నుంచి వచ్చే నిధులతో రాష్ట్రంలో బుద్ధిస్ట్ సర్క్యూట్‌ను ఏర్పాటు చేసి టూరిజం అభివృద్ధి చేయాలన్న కృత నిశ్చయంతో సీఎం జగన్ ఉన్నారని వెల్లడించారు. బుద్ధుడి భోధనలను ప్రజల వద్దకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామని ఆమె అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం తమదని సత్యవతి ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement