Thursday, April 25, 2024

ఠారెత్తిస్తున్న టమాటా..! మదనపల్లెలో కిలో రూ.130

రాజుపాలెం, (ప్రభ న్యూస్) : పెరిగిపోతున్న పెట్రోల్ ధరల్లాగే మార్కెట్‌లో టమాటా రేటు కూడా మండిపోతోంది. సాధారణంగా చలికాలంలో కేజీ రూ.20 అమ్మే టమాటాల ధర ఇప్పుడు చుక్కలను తాకుతోంది. గుంటూరులో కిలో టమాటా సెంచరీకి చేరింది. సూపర్‌ మార్కెట్లలో దీని ధర రూ.100 వరకు ఉండగా, ఆన్‌లైన్‌ స్టోర్లలో రూ.130 వరకు ఉంది. దీంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో కిలో ధర రూ.వంద దాటేసింది.

చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌లో అయితే కేజీ రూ.150 దిశగా పరుగులు పెడుతోంది. మంగళవారం ఇక్కడ రికార్డు స్థాయిలో కేజీ ట‌మాటా ధర రూ.130 పలికింది. ఈనెల ఆరంభంలో కేజీ రూ.40 ఉన్న టమాటా ఇప్పుడు ఏకంగా రూ.130కి ఎగబాకింది. క్యాప్సికం, ఉల్లిపాయలతోపాటు ఇతర కూరగాయల ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. నెల్లూరు, విజయవాడతో పాటు తమిళనాడుకు చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, కలకడ, పలమనేరు ప్రాంతాల నుంచి, కర్ణాటకలోని కోలారు నుంచి టమాటాలు ఎక్కువగా ఎగుమతి అయ్యేవి. తుఫాను ప్రభావంతో పంట నష్టపోయి దిగుబడి తగ్గిపోవటంతో సామాన్యుడిపై పెనుభారం పడింది. సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.

ఒక్క టమాటా ధరలు మాత్రమే కాకుండా, కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితులు నెలకొన్నాయి. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అంటూ సామాన్యులు లబోదిబోమనేలా చేస్తున్నాయి. పండిన పంటకు అనూహ్యమైన ధర లభించడంతో రైతులు పండగను జరుపుకుంటున్నారు. ధరలు రైతుల ముఖాల్లో సంతోషాన్ని నింపుతున్నా, మరోవైపు సామాన్యులకు మాత్రం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్లకు వంటల్లో టమాటాలు లేకుంటే ఆ ఇబ్బంది అంతా ఇంతా కాదు. ప్రస్తుతం చాలా మంది టమోటాలకు బదులుగా చింతపండును ఉపయోగిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement