Sunday, October 13, 2024

Press Meet – ఎపిలో రాక్ష‌స రాజ్యం – దేవుడిని ద‌ర్శ‌నానికి ఆటంకాలే – జ‌గ‌న్

అమ‌రావ‌తి – ఎపిలో ప్ర‌స్తుతం రాక్ష‌స‌రాజ్యం న‌డుస్తున్న‌ద‌ని, కనీసం దేవుడి ద‌ర్శ‌నం చేసుకునే ప‌రిస్థితులు కూడా అక్క‌డ లేవ‌ని మండిప‌డ్డారు వైసిపి అధినేత‌,మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్.. తన రాజకీయ జీవితంలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. . మాజీ ముఖ్యమంత్రి అయిన తాను తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వెళుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు.

అమ‌రావ‌తిలోని త‌న నివాసంలో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, దేవుడి దగ్గరకు వెళుతుంటే అడ్డుకునే కార్యక్రమాన్ని ఎప్పుడూ చూడలేదని చెప్పారు. జగన్ తో పాటు వెళ్లేందుకు అనుమతి లేదంటూ వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారని దుయ్యబట్టారు. ఇది రాక్షస రాజ్యం కాదా? అని ప్రశ్నించారు. లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు. వంద రోజుల ప్రభుత్వ పాలన వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
తిరుమ‌ల‌లో త‌న ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకునేందుకు తిరుప‌తికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ శ్రేణులను పిలిపించారని… ఇది బీజేపీ పెద్దలకు తెలుసో? తెలియదో? అని జగన్ చెప్పారు.

- Advertisement -

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేసి దేవుడి పవిత్రతను దెబ్బతీశారని దుయ్యబట్టారు. రాజకీయ దురుద్దేశంతోనే జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేశారని అన్నారు. తిరుమల లడ్డూ విశిష్టతను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అబద్ధాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు.

అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆధారాలు చూపిస్తాం..

”జంతువుల కొవ్వుతో ప్రసాదాలు చేశారని అబద్ధాలు చెబుతున్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆధారాలు చూపిస్తాం. టిటిడి లో 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలవడం దశాబ్దాలుగా జరుగుతున్నదే. తక్కువ రేటుకు కోట్‌ చేసిన వారికి టెండర్‌ ఖరారు చేస్తుంది. దశాబ్దాలుగా జరుగుతున్న కార్యక్రమాన్ని వివాదాస్పదం చేస్తున్నారు.

తిరుమలకు వచ్చిన నెయ్యిని మూడు సార్లు పరీక్షిస్తారని జగన్ అన్నారు. “జులై 6, 12 తేదీల్లో నాలుగు ట్యాంకర్లు వచ్చాయి. ఆ నాలుగు ట్యాంకర్లు టెస్టులు ఫెయిల్‌ అయ్యాయి. టెస్టులు ఫెయిల్‌ అయిన 4 ట్యాంకర్లను వెనక్కి పంపారు. టెస్ట్‌లు ఫెయిల్‌ అయితే మైసూర్‌ ల్యాబ్‌కు పంపుతారు.. కానీ తొలిసారి ఈ శాంపిల్స్‌ను గుజరాత్‌కు పంపారు. ట్యాంకర్లను వెనక్కి పంపి సదరు కంపెనీకి నోటీసులు ఇచ్చారు. 2 నెలల తర్వాత చంద్రబాబు జంతువుల కొవ్వు కలిసిందన్నారు. ఆ మరుసటి రోజే టీడీపీ ఆఫీస్‌లో ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను బయటపెట్టారు. కల్తీ నెయ్యి ప్రసాదాలకు వాడలేదని సెప్టెంబర్ 20న ఈవో చెప్పారు. ఈ నెల 22న ఈవో ఇచ్చిన నివేదికలో కూడా ట్యాంకర్లు వెనక్కి పంపినట్లు ఉంది. అబద్ధాలతో చంద్రబాబు తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు” అని జగన్ అన్నారు

తప్పులు చేయలేని విధంగా టీటీడీ వ్యవస్థ ఉంటుందని జగన్ చెప్పారు. ప్రసిద్ధిగాంచిన వ్యక్తులే టీటీడీ బోర్డులో ఉంటారని వారే నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. టీటీడీ టెండర్ల ప్రక్రియలో ప్రభుత్వానికి ప్రమేయం ఉండదని చెప్పారు. టెండర్లలో తక్కువ కోట్ చేసిన వారికే ఆర్డర్లు ఇస్తారని తెలిపారు. టీటీడీ చరిత్రలో తొలిసారి లడ్డూ శాంపిల్ ను గుజరాత్ లోని ల్యాబ్ కు పంపించారని అన్నారు.

నా మ‌తం మాన‌వ‌త్వం….

గుడికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుందామంటే నా మతం ఏంటని అడుగుతున్నారు. డిక్లరేషన్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. రాసుకోండి.. నా మతం మానవత్వం. ఇంట్లో నేను బైబిల్ చదువుతాను. గుడికి వెళ్తే హిందూ సంప్రదాయాలను అనుసరిస్తాను. ముస్లిం, సిక్కు మతాలనూ గౌర‌విస్తాను, అనుసరిస్తాను. గతంలో నా తండ్రి తిరుమల శ్రీవారికి ఐదేళ్లు పట్టువస్త్రాలు సమర్పించారు. నేను ఆయన కొడుకునే కదా.. నేను సీఎం అయ్యాక శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించాను. మతం పేరుతో రాజకీయాలు చేయడం దౌర్భాగ్యం. మాజీ ముఖ్యమంత్రిగా నేను తిరుమలకు వెళ్లకూడదా? తొలిసారి తిరుమలకు వెళ్తున్నాను అనుకుంటే ఏమో అనుకుంటాం. పదిహేనుసార్లకు పైగా తిరుమలకు వెళ్లాను అని జ‌గ‌న్ అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement