Thursday, March 28, 2024

మరుగుదొడ్లు మరింత పరిశుభ్రంగా ఉండాలి : రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్

శ్రీకాకుళం : శ్రీకాకుళం పట్టణంలోని ఆర్టిసి కాంప్లెక్స్ ఆవరణలో గల మరుగుదొడ్లు మరింత పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రవాణా, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ తో కలిసి ఆర్టిసి కాంప్లెక్స్ ను ముఖ్యకార్యదర్శి సందర్శించారు. అక్కడ నాన్ స్టాప్ బుకింగ్ కౌంటర్స్, ఫ్లాట్ ఫారాలు, మరుగుదొడ్లు, దుకాణాలు, ఆవరణలోని పలు ప్రాంతాలను నిశితంగా పరిశీలించిన ఆయన వివరాలను ఆరాతీసారు. శ్రీకాకుళం బస్ స్టేషన్ నుండి రోజుకు సుమారు 25వేల మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నందున అందుకు తగిన విధంగా వసతులు కల్పించాలని అన్నారు. కాంప్లెక్స్ లోపల భాగంలో మరుగుదొడ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆవరణలోని మరుగుదొడ్లను మరింత పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. రెండు నాన్ స్టాప్ కౌంటర్లను పరిశీలించి రోజుకు 1800 మంది ప్రయాణీకులు వినియోగించుకోవడంపై సంతోషాన్ని వ్యక్తం చేసారు. తదుపరి ఆర్టిసీ బస్సును జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించి, ప్రయాణీకులకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. అనంతరం కాంప్లెక్స్ లోని క్యాంటిన్, దుకాణాలను సందర్శించి ధరల పట్టికను పరిశీలించారు. నిర్ణయించిన ధరలకే వస్తువులను విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రాంతీయ మేనేజర్ ఏ.విజయకుమార్, కార్యనిర్వాహక సంచాలకులు గిడుగు వెంకటేశ్వరరావు, 1, 2వ డిపోల మేనేజర్లు మాధవ, శర్మ, ప్రజా సంబంధాల అధికారి బిఎల్పి రావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement