Saturday, April 20, 2024

టిడిపి గూటికి వైసిపి ఎంపి మాగుంట‌, ఎమ్మెల్యే ఆనం?

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో అధికార వైసీపీ లో రోజురోజుకు అసమ్మతి పెరుగుతున్నదా..? పలు జిల్లాల్లో ముఖ్య నేతల మధ్య అంతర్గత విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయా..? అధిష్టాన పెద్దల వ్యవహార శైలిపై సీనియర్‌ నేతల్లో అసంతృప్తి కట్టలు తెంచుకుంటున్నదా? ఫలితంగా బలమైన కుటుంబాలు వైసీపీని వీడబోతున్నాయా..? అని అంటే పార్టీ శ్రేణుల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకు మరింత బలాన్ని చేకూర్చేలా వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, వెంకటగిరి శాసన సభ్యుడు ఆనం రామనారాయణరెడ్డి ఇటీవల ప్రభుత్వం తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆనం వ్యాఖ్యల తర్వాత నియోజక వర్గంలో ఆయనకు ప్రాధాన్యతను తగ్గించారు. దీంతో ఆయన తెలుగు దేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటు న్నట్లు తెలుస్తోంది. ఆనంతో పాటు మరో బలమైన కుటుంబానికి చెందిన ఒంగోలు పార్లమెంట్‌ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా సైకిల్‌ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారని జోరుగా ప్రచారం కూడా సాగుతుంది.

అందుకు తగ్గట్టే గత కొంతకాలంగా మాగుంట దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రకాశం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించే సందర్భంలోనూ మాగుంట ముఖం చాటేస్తున్నారు. ప్రత్యేకించి జిల్లాలో ఆయనకు తగిన ప్రాధాన్యతను కల్పించకపోవడం, సొంత పార్టీ నేతలు సైతం స్థానిక ఎంపీగా తగిన గౌరవాన్ని ఇవ్వకపోవడం, తదితర కారణాలు వెరసి ఆయన వైసీపీపై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపధ్యంలోనే ఆనం, మాగుంటలు త్వరలో టీడీపీ తీర్ధం పుచ్చుకోబోతున్నారన్న వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వారి ముఖ్య అనుచరుల్లో సైతం ఇదే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదిలా ఉండగా ఒకట్రెండు రోజుల్లో ఆనం నెల్లూరులో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించబోతున్నారు. వరుసగా మూడు రోజుల పాటు నెల్లూరు, వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలకు చెందిన తమ అనుచరులతో ఆయన ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి పార్టీ మారే విషయంపై అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ అంతర్గతంగా నేతల మధ్య మాత్రం విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. అందులో భాగంగానే ఆనం తరహాలోనే ఇటీవల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆదివారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరుసగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో ఉన్న విభేదాలను బహిర్గతం చేస్తుంది.

రేపు ముఖ్య అనుచరులతో..మాజీ మంత్రి ఆనం సమావేశం
2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి ఆ ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆయన గత కొంతకాలంగా సొంత పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది అధికారుల తీరును కూడా పలు సమావేశాల్లో ఎండగట్టారు. ఈ నేపధ్యంలోనే ఇటీవల సీఎం జగన్‌ను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో ఆనం వ్యాఖ్యలపై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గానికి తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని సమన్వయకర్తగా నియమించారు. దీంతో ఆనంకు నియోజకవర్గంలో కూడా ప్రాధాన్యత లేకుండా పోయింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి కూడా రావద్దని పరోక్షంగా అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పొమ్మన లేక సొంత పార్టీ పొగ పెడుతున్న నేపధ్యంలో మంగళ, బుధవారాల్లో ముఖ్య అనుచరులతో సమావేశం అయి పార్టీ మారే విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే మంగళవారం నుంచి నెల్లూరులో మూడు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య అనుచరులతో ఆనం సమావేశం కానున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ముఖ్య అనుచరుల సమావేశం అనంతరం ఆయన టీడీపీకి గూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ అధిష్టానం నుంచి కూడా ఆయనకు పిలుపు వచ్చినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆనంకు చిరంజీవి నుంచి కూడా పిలుపొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. జనసేనలోకి వస్తే రాష్ట్రంలో ప్రాధాన్యత కలిగిన బాధ్యతలను అప్పగిస్తామని, ఆ దిశగా చిరు నుంచి ఆనంకు భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఉత్తరాంధ్రలో మరో ఇద్దరు సీనియర్‌ నేతలది ఆనం బాటే
మాజీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డితో పాటు ఉత్తరాం ధ్రకు చెందిన మరో ఇద్దరు సీనియర్‌ నేతలు ఆనం బాటలోనే సైకిల్‌ ఎక్కేందుకు సిద్ధమవుతోన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఆనంతో పాటు ఆ ఇద్దరు నేతలు రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించిన వారే. అయితే ఆనం కంటే ముందువారు వైసీపీలో చేరినప్పటికీ ప్రస్తుతం అధికార పార్టీలో ప్రాధాన్యత కలిగిన హోదాల్లో ఉన్నప్పటికీ వారు ఆశించిన స్థాయిలో వారికి ప్రాధాన్యత లభించడం లేదు. కొన్ని సందర్భాల్లో అవమానాలు కూడా ఎదుర్కొవలసి వస్తుంది.
ఈ నేపధ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో ఆనంతో ఆ ఇద్దరు నేతలు వేరువేరుగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఆ సందర్భంగా పార్టీ మారే అంశంపై చర్చలు కూడా జరిగినట్టు చెబుతున్నారు. అయితే ముందు ఆనం టీడీపీ గూటికి చేరిన తర్వాత ఆ ఇద్దరు నేతలు కూడా ఉత్తరాంధ్రలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సైకిల్‌ ఎక్కాలని నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement