Sunday, March 24, 2024

సైకిల్‌ సారధ్యానికి త్రిముఖ పోటీ

కందుకూరు గ్రామీణ , : కందుకూరు శాసనసభా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ముగ్గురు తీవ్రంగా పోటీ పడుతున్నారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జిగా మాజీ శాసనసభ్యుడు పోతుల రామారావు ఉన్నప్పటికీ గత శాసనసభ ఎన్నికల తరువాత ఆయన క్రియాశీలంగా లేని విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఆయన అనారోగ్యానికి కూడా గురయ్యారు. ఈ నేపధ్యంలోనే నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను మరొకరికి అప్పగించాలని సైకిల్‌ శ్రేణులు కొంత కాలంగా కోరుతున్నాయి. ఇన్‌చార్జి బాధ్యతల కోసం ఇప్పటికే పలువురు తీవ్రంగా పోటీ పడుతున్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల తరువాత కందుకూరు ఇన్‌చార్జి విషయమై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తోందని తెలిసింది. ఇన్‌చార్జి బాధ్యతల కోసం ఓ వైపు మాజీ శాసనసభ్యుడు డాక్టర్‌ దివి శివరాం ప్రయత్నిస్తుండగా మరోవైపు ఇంటూరి రాజేష్‌, దామచర్ల సత్యనారాయణ వంటి వారు కూడా తమ యత్నాలు ప్రారంభించారు. డాక్టర్‌ దివి శివరాం ఈ నియోజకవర్గానికి పాత కాపే… ఆయన ఈ నియోజకవర్గం నుంచి గతంలో రెండు సార్లు శాసనసభకు గెలిచారు. 1994 నుంచి 2014 వరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో దివి శివరామే కందుకూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి గత శాసనసభ ఎన్నికల సమయంలో మాత్రం ఆయనకు పార్టీ అభ్యర్ధిత్వం లభించలేదు. 2017 లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి దూకిన పోతుల రామారావుకు చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో అభ్యర్ధిత్వం కట్టబెట్టారు. అయితే ఆయన గెలుపు గుర్రం ఎక్కలేకపోయారు. దివి శివరాంకు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణుల్లో ఇప్పటికీ కొంత పట్టు ఉంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిత్వం కోసం దివి శివరాం పట్టుపట్టడం లేదు. కాకపోతే నియోజకవర్గంలో పార్టీని తిరిగి గాడిన పెట్టడానికి ఇన్‌చార్జి బాధ్యతలను తీసుకోవాల నేది శివరాం అభిప్రాయం. మరోవైపు ఇటీవల కాలంలో రాజకీయ తెరమీదకు వచ్చిన ఇంటూరి రాజేష్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నియోజకవర్గ బాధ్యతల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి , ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను కలిశారు. తమ మనుసులోని మాటలను వారికి విన్నవించుకున్నారు. అంతేగాక ఇటీవల జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్ధుల కోసం ఇంటూరి రాజేష్‌ సుమారు కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. ఆయా గ్రామ పంచాయితీల ఒటర్ల సంఖ్యను బట్టి సర్పంచ్‌ అభ్యర్ధులకు విరాళాలు ఇచ్చారు. ఇంకో వైపు కొండపి నియోజకవర్గానికి చెందిన దామచర్ల సత్యనారాయణ కూడా కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల కోసం ప్రయత్నిస్తున్నారు. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు మనుమడే సత్యనారాయణ. కొండపి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఆయనది కీలక పాత్ర. షెడ్యూల్‌ కులాలకు కొండపి నియోజకవర్గం రిజర్వ్‌ కావడంతో దామచర్ల సత్యనారయణ చూపు పొరుగునే ఉన్న కందుకూరు నియోజకవర్గం పై పడింది. కొండపి నియోజకవర్గ శాసనసభ్యుడు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సత్యనారాయణకు సన్నిహితుడు. అంతేగాక నారా లోకేష్‌తోనూ దామచర్ల సత్యనారాయణకు మంచి సంబంధాలు ఉన్నాయి. సత్యనారాయణ ఇటీవల కందుకూరు ఇన్‌చార్జి విషయమై నారా చంద్రబాబునాయుడుని కూడా కలిశారని తెలిసింది. ముగ్గురు నేతలు మూడువైపులా తమ ప్రయత్నాలు తీవ్రం చేయడంతో ఎవరికి ఇన్‌చార్జి బాధ్యత లభిస్తుందా అనే విషయమై కందుకూరు నియోజకవర్గ సైకిల్‌ శ్రేణుల్లో చర్చ సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement