Thursday, April 18, 2024

గుట్టుగా.. గుట్కా దందా.! పాన్‌షాపుల్లో గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు..

ఒంగోలు, ప్రభన్యూస్ : నిషేధిత గుట్కా వ్యాపారం గుట్టుగా సాగుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గుట్కాల నిషేధం అమలు చేస్తున్నప్పటికీ.. కొందరు అక్రమార్కులు మాఫియాను తలపించే విధంగా గుట్కా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు. మాఫియా ఎత్తులు వేస్తూ.. నిషేధిక గుట్కాను కిరాణా షాపులకు చేరవేస్తున్నారు. పోలీసులు అక్కడక్కడా దాడులు చేసి పట్టుకున్నప్పటికీ.. వ్యాపారాన్ని అదుపు చేయలేకపోతున్నారు. నగర శివారులే అడ్డాలుగా ఈ వ్యాపారం యధేచ్ఛగా సాగుతోంది. కొందరు వ్యాపారులు తమ ఇళ్లనే స్థావరాలుగా మార్చుకొని వ్యాపారం చేస్తున్నారు. ప్రజల అలవాటునే ఆసరాగా చేసుకొని ధరలను నాలుగింతలుగా అధికం చేసి అందినకాడికి దండుకుంటున్నారు. ఒంగోలు నగరంలోని కొత్తమార్కెట్‌, రంగుతోట, పాత మార్కెట్‌, కొత్తపట్నం బస్టాండ్‌, గాంధీరోడ్డు, మంగమూరు డొంక, గుంటూరు రోడ్డు తదితర ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకొని వ్యాపారులు తమ గుట్కా సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నట్లు సమాచారం.

వాస్తవానికి ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని 2013 జనవరి 9వ తేది నుంచి ప్రభుత్వం గుట్కా, పొగాకు ఉత్పత్తుల పై నిషేధం విధించింది. గుట్కాలు విక్రయించడం చట్టరీత్యానేరం. వీటి వినియోగం ద్వారా గొంతు క్యాన్సర్‌ బారిన పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. అయితే ఈ నిషేధం ఎక్కడ కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగంగా విక్రయాలు కొనసాగుతున్నాయి. కానీ ఇవేమీ అధికారులకు కనిపించకపోవడం విచారకరం. ప్రభుత్వం గుట్కా నిషేధాన్ని అమలు చేసే బాధ్యతను మూడుశాఖలకు అప్పగించింది. రెవెన్యూ, పోలీసు, ఆహార తనిఖీ అధికారులు సంయుక్తంగా గుట్కా విక్రయాలను అడ్డుకోవాల్సి ఉంది. కానీ రెవెన్యూ, ఆహార తనిఖీ అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో గుట్కా వ్యాపారులకు కరోనా బాగా కలిసొచ్చింది. కరోనా మాటున వ్యాపారులు లక్షల్లో లాభాలను ఆర్జిస్తున్నారు. వీటి ధరలను మూడు, నాలుగిందలు చేసి విక్రయిస్తున్నారు. రూపాయికే విక్రయించాల్సిన గుట్కాను రూ.5,6 రూపాయలకు విక్రయిస్తున్నారు. మూడు రూపాయలకు విక్రయించాల్సిన పొగాకు ప్యాకెట్‌ను రూ.10 నుంచి 12 రూపాయల వరకు అమ్ముతున్నారు.

మత్తుకు బానిసవుతున్న యువత

దేశంలో యువత మత్తుకు బానిస అవుతుంది. మరో 20 సంవత్సరాలలో యువత జీవితాలు ప్రశ్నర్థకంగా మారే అవకాశం లేకపోలేదు. మద్యం అధిక ధరలు కారణంగా మ‌త్తుకు బనీసలు అవుతున్న యువత అడ్డదారిలో పయనిస్తుంది. అందులో బాగంగానే గంజాయి, గుట్కా, గుడంబా, వైపు యువత అకర్షణకు గురవుతుంది. తాత్కాలిక ఆనందం కోసం యువత, మత్తుకు బానిస అవుతుంది. దీంతో వారి జీవితాలు నష్టపోతున్నాయి. అయితే మత్తుపదార్థాల అక్రమవ్యాపారులకు అధికార పార్టీ అండదండలు ఉండడంతో నిషేదించబడిన గుట్కా వ్యాపారం యథేచ్ఛగా నడుస్తోంది. దేశానికి ఎన్నేముకైన యువత పెడదారిన పడుతూ మత్తు మాయలొ పడి వారి అముల్యమైన జీవితాలను అర్థంతరంగా ముగించుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement