Wednesday, April 24, 2024

జలశక్తి శాఖ మంత్రిని కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు

వెలిగొండ ప్రాజెక్టు సమస్యపై ఏపీకి చెందిన పలువురు టీడీపీ నేతలు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌‌తో కలిశారు. ఈ సందర్భంగా కేంద్రం జారీ చేసిన గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదన్నారు. వెలిగొండ ప్రాజెక్టును తక్షణమే అనుమతి పొందిన ప్రాజెక్టుగా కేంద్ర గెజిట్‌లో చేర్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రకాశం జిల్లాలో కరువు పరిస్థితి, ప్రాజెక్టు ప్రాధాన్యతను గజేంద్ర సింగ్ షెకావత్‌కు నేతలు వివరించారు. టీడీపీ నేతల విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. జల్‌శక్తి మంత్రిని కలిసిన వారిలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు. 

ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యేలు బోలినేని రామారావు, మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, డా. ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్ రావు తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

కాగా, వెలిగొండ ప్రాజెక్ట్‌ పై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఆదివారం లేఖ రాసిన సంగతి తెలిసిందే. అంతకు రెండు రోజుల ముందు ఈ ప్రాజెక్ట్‌కు నిధులు ఇవ్వొద్దంటూ కేంద్రానికి తెలంగాణ లేఖ రాసింది. ఈ క్రమంలో వెలిగొండకు అనుమతులు లేవనడం సరికాదని, ఆ ఫిర్యాదుపై పునరాలోచన చేయాలని ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ తీరు వల్లే ఈ ప్రాజెక్ట్‌కు అనుమతి లేదని గెజిట్‌లో పెట్టారని, కానీ 2014 విభజన చట్టంలో కల్వకుర్తి, నెట్టెంపాడుతో సహా వెలిగొండ ప్రాజెక్ట్‌ను కూడా పెట్టారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి: లోకేష్, పవన్ కళ్యాణ్ అసలు నాయకులే కాదు: డిప్యూటీ సీఎం ధర్మాన

Advertisement

తాజా వార్తలు

Advertisement