Thursday, March 28, 2024

Power Star: ప‌వ‌న్ క‌ల్యాణ్.. రియ‌ల్ హీరో అనిపించుకుంటారా..

కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తోన్న తీరుని త‌ప్పుబ‌డుతున్నారు ఏపీ ప్ర‌జ‌లు. విశాఖ ఉక్కు విష‌యంలో కేంద్రం ఉక్కు మ‌న‌సుతో నిర్ణ‌యాలు తీసుకుంటోంద‌ని మండిప‌డుతున్నారు. విశాఖ ఉక్కుని ప్రైవేట్ ప‌రం చేస్తామ‌నే పంతాన్ని ప‌ట్టుకు కూర్చుంది. దాంతో ప్ర‌ధాని మోదీ తీరుపై ఆగ్రహ‌న్ని వ్య‌క్తం చేస్తున్నారు ప‌లు పార్టీల నేత‌లు. ఈ విష‌య‌మై జ‌న‌సేన అధినేత‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా స్పందించారు.

ఇప్ప‌టికే పవన్ కళ్యాణ్ కేంద్ర పెద్దలను కలిశారని.. ప్ర‌త్యేకంగా కేంద్ర మంత్రి అమిత్ షాను కలసి విశాఖ ఉక్కుని కాపాడాలని కోరారని జనసైనికులు వెల్ల‌డించారు. మరి పవన్ కోరారు కానీ కేంద్రం తీరు వేరుగా ఉంది. ఇప్ప‌టికి మరిన్ని అడుగులు ముందుకు వేస్తూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నడుం బిగిస్తోంది. ఈ సమయంలో పవన్ విశాఖలో గర్జిస్తే.. కేంద్రానికి వినిపిస్తుందా అనే చర్చ కూడా ఉంది. అయితే పవన్ విశాఖ సభలో ఏం చెబుతారు అన్నది కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పవన్ కనుక విశాఖ ఉక్కు మీద చిత్తశుద్ధితో వ్యవహరించదలుచుకుంటే కచ్చితంగా కేంద్రాన్ని ఆయన విమర్శించాలి. అదే సమయంలో మిత్ర పక్షంగా బీజేపీని నిలదీయాలి.

ప్రధాని మోడీని తక్షణం ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేయాలి. అలా కనుక చేస్తే పవన్ క‌ల్యాణ్ ఏపీ ప్ర‌జ‌లకి రియ‌ల్ హీరో అవుతాడు. కానీ పవన్ అలా కాకుండా ఏపీలోని వైసీపీ సర్కార్ ని విమర్శించి ..వారి వల్లనే ప్రైవేటీకరణ జరుగుతోంది అన్న మాట అంటే అది ఫక్తు రాజకీయ ప్రసంగంగానే భావించాల్సి ఉంటుంది. మొత్తానికి పవన్ ఎలా మాట్లాడుతారు.. ఆయన విశాఖ ఉక్కు విషయంలో కేంద్రంలో అమీ తుమీ తేల్చుకుంటారా లేక కేంద్రానికి ఒక విన్నపం చేసేసి యధా ప్రకారం వైసీపీ మీద నిప్పులు చెరుగుతారా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి ప‌వ‌న్ ఏ నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement