Saturday, April 20, 2024

ఇవాళ కూడా పెరిగిన‌ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

దేశంలో పెట్రోల్ ధర పెరుగుతూనే వస్తోంది. ఈరోజు కూడా రేటు పైకి కదిలింది. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ధరలు తగ్గినా కూడా దేశీ మార్కెట్‌లో ఇంధన ధరలు పెరగడం గమనార్హం. వ‌రుస‌గా నాలుగో రోజూ పెట్రో ధ‌ర‌ల‌ను పెంచుతూ దేశీయ చ‌మురు కంపెనీలు నిర్ణ‌యం తీసుకున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల నేప‌థ్యంలో సుమారు రెండు నెల‌ల‌పాటు దేశంలో పెట్రోల్ ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. ఎన్నిక‌లు ముగియ‌డంతో గ‌త నాలుగు రోజులుగా ధ‌ర‌లు పెరుగుతూ వ‌స్తున్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధ‌మైన ప‌న్నులు విధిస్తుండ‌టంతో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్లో తేడాలు ఉంటాయి. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో లీట‌ర్‌ పెట్రోల్‌పై 25-28 పైస‌లు, డీజిల్‌పై 30-33 పైస‌ల వ‌ర‌కు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.91.27, డీజిల్‌ రూ.81.73కు చేరింది. ఇక ముంబైలో పెట్రోల్ రూ.97.61, డీజిల్‌ రూ.88.82, చెన్నైలో పెట్రోల్‌ రూ.93.15, డీజిల్‌ రూ.86.65, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.91.41, డీజిల్‌ రూ.84.57కు చేరాయి. బెంగ‌ళూరులో పెట్రోల్‌ రూ.94.30, డీజిల్‌ రూ.86.64కు, హైద‌రాబాద్‌లో పెట్రోల్‌ రూ.94.86, డీజిల్‌ రూ.89.11కు, జైపూర్‌లో పెట్రోల్‌ రూ.97.65, డీజిల్‌ రూ.90.25గా ఉన్నాయి.

పెట్రోల్ ధర 29 పైసలు, డీజిల్ ధర 34 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో శుక్రవారం పెట్రోల్ ధర రూ.94.86కు, డీజిల్ ధర రూ.89.11కు చేరాయి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 28 పైసలు పెరుగుదలతో రూ.97.30కు చేరింది. డీజిల్‌ ధర 33 పైసలు పెరుగుదలతో రూ.91.01కు ఎగసింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 28 పైసలు పెరుగుదలతో రూ.97.56కు చేరింది. డీజిల్ ధర 33 పైసలు పెరుగుదలతో రూ.91.27కు ఎగసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement