Monday, April 15, 2024

పెడదోవ పడుతున్న యువత.. కౌమార దశలో నేరస్తులుగా మారుతున్న వైనం..

రాయలసీమ, ప్రభన్యూస్‌ ప్రతినిధి: సెల్‌ఫోన్‌ వినియోగం పెరిగిపోయి అంతర్జాలం అందుబాటు లో ఉండటంతో యువకులు పక్కదారి పడుతున్నారు. మంచి విషయాలకు వినియోగించుకోవాల్సి ఉండగా దుర్వినియోగం చేసుకుంటున్నారు. రోజుల లో చాలా సమయం పాటు చరవాణిల తో కాలాన్ని గడిపేస్తున్నారు. విద్యార్థులు సైతం చదువును పక్కనపెట్టి సెల్‌ఫోన్ల పైనే ఎక్కువ దృష్టి సారించారు. ఫలితంగా ఏకాగ్రత దెబ్బతిని చచ్చిపోతున్నారు. వాటి ప్రభావంతో పలువురు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. రాయల సీమ జిల్లాలో కొందరు యువకులు జల్సా జీవితానికి ఆకర్షితులవుతున్నారు. ఈనేపథ్యంలో పలు నేరాలకు పాల్పడుతున్నారు. బైకులపై షికార్లు కొట్టేందుకు, బైకు దొంగతనాలకు పాల్పడుతూ, మద్యం, గంజాయి ఇతర దురలవాట్లకు బాని సలై చివరికి డబ్బుకోసం గంజాయి, అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారు. మరోవైపు క్రికెట్‌ బెట్టింగ్‌ యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాలోచనతోనే క్రికెట్‌ పందాలను ఎంచుకుని డబ్బు పోగొట్టుకుని అప్పుల పాలై చివరికి బెట్టింగ్‌ బుకీలుగా మారుతున్నారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఈ తరహాలో బుకీలుగా మారి పట్టుబడిన యువకులు దాదాపు వంద మందికి పైగా ఉన్నారు. సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్లు సైతం బుకీలుగా మారి లాడ్జిలు, అద్దె ఇళ్లలో కార్యకలాపాలు నిర్వహిస్తూ పోలీసులకు దొరికిన సంద ర్భాలున్నాయి. చోరీలకు పాల్పడుతున్నవారిలో యువకులే అధికంగా వుంటున్నారు.

దూకుడుతనం, ఆవేశం అధికంగా వుండే యువకులు క్షణికా వేశాలతో నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలో ఎన్నో నేరాలు జరిగాయి. కౌమార దశలో వున్న కొందరు యువకులు జల్సాలకు అలవాటుపడి పెడదారి పడుతున్నారు. చదువుకుని ఉన్నత భవిష్య త్తుకు పునాదులు వేసుకొవాల్సిన వయసులో నేరా లకు పాల్పడుతూ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సామాజిక రుగ్మతలు, విపరీత పోకడల ప్రభావానికి గురై యువత కారణంగా సమాజంలో నేరాలు పెరుగుతున్నట్లు పోలీసు అధికారులు ప్రత్యేకంగా పేర్కొంటున్నారు. రాయలసీమ జిల్లాలో పలువురు యువకులు సైతం తప్పటడుగులు వేస్తున్నారు. కౌమార వయసులో ఉండే యువకుల విషయాల్లో తల్లిదండ్రులు అప్ర మత్తంగా వుండాల్సిన అవసరం ఎంతైనా వుందని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. వారి కదలికలు ప్రవర్తన తీరును నిరంతరం గమనిస్తూ ఉండాలి. వారి వ్యక్తిగత, సెల్‌ఫోన్‌లకు కోడ్‌ నెంబరుతో లాక్‌ చేసినట్లయితే అను మానించాలి. ఎలాంటి స్నేహితులతో తిరుగు తున్నారో, ఎక్కువ డబ్బు ఎందుకు ఖర్చు చేస్తున్నారో తెలుసు కోవాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడిపేలా జాగ్రత్త పడాలి. దురలవాట్లకు పాల్పడి, నేరాల పరిమాణాలను తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉండాలి. ఇటీవల చిత్తూరు, కడప జిల్లా సరిహద్దు ప్రాంతంలో అక్రమంగా ఎర్ర చందనం తరలిస్తూ పట్టు పడగా అందులో సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ విద్యార్థులుండటం గమనార్హం. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో రౌడీ మూకల ఆగడాలకు హద్దు లేకుండా పోతోంది.

ముఖ్యంగా యువత అక్రమ మార్గంలో నడవడం, చోరీలతో జైలుకెళ్లి అక్కడ నేరస్థులంతా కలిసి యధా విధంగా బయటకు వచ్చిన అనంతరం కూడా మిగిలిన విద్యార్థులను దగ్గరకు చేర్చుకుని నేరస్థులుగా చలామణి అవుతున్నారు. ఇటీవల ఎమ్మిగనూరు పట్టణంలో 25 ఏళ్లలోపు 69 గ్యాంగ్‌ చలామణి అవుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. కర్నూలు నగరం జోహరాపురం చెందిన అలియాజ్‌ జలీల్‌ దురలవాట్లకు బానిసై రూ. 2 లక్షల డబ్బుకోసం కిరాయి హంతకుడుగా మారి తన స్నేహితులతో కలసి ఓ వ్యక్తిని హత్య చేశారు. కర్నూలు నగరంలోని పాత బస్తీకి చెందిన కొందరు యువకులు గంజాయికి అలవాటు పడ్డారు. చివరికి డబ్బుకోసం విశాఖనుంచి గంజాయి తెప్పించుకుని రాయలసీమ జిల్లాల్లో పొట్లాలుగా చేసి అమ్ముతూ పోలీసులకు దొరికిపోయారు. డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థి క్రికెట్‌ బెట్టింగ్‌కు అలవాటుపడి చివరికి డబ్బుకోసం దొంగతనాలకు పాల్పడి జైలుపాలవుతున్నారు. ఇలా రాయలసీమ జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో నిత్యం యువత నేరస్థులుగా చలామణి అవుతున్నారు. ముఖ్యంగా యువకుల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతోపాటు డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్‌, మెడిసన్‌ చదివే విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement