Thursday, March 23, 2023

విభజన తుపాన్‌.. రెండు ముక్కలు కానున్న కర్నూల్‌ జిల్లా..

కర్నూలు జిల్లాలోని నంద్యాల జిల్లా చేసేందుకు సంకేతాలు అందుతున్నాయి . ఇందుకు సంబంధించి నేడో, రేపో నోటిఫికేషన్‌ విడుదల కాబోతున్నట్లు- రాజధాని వర్గాల నుంచి జిల్లాకు సమాచారం అందుతుంది. ఉగాదిలోపు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేసి.. కొత్త జిల్లాను అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోన్నట్లు- సమాచారం. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతీ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు- చేస్తామని ఎన్నికలకు ముందే వైసీపీ తమ మేనిఫెస్టోలో పొందుపరిచింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 మార్చి 31వ తేదీ నాటికి కొత్త జిల్లాలను ఏర్పాటు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కరోనా కారణంగా 2021 జనాభా లెక్కల సేకరణ తదితర కారణాల వల్ల వాయిదా పడింది. అంతేకాదు నంద్యాల కొత్త జిల్లా విషయంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలు కూడా తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకు వచ్చాయి. ముఖ్యంగా పార్లమెంటు, నియోజకవర్గాల ప్రాతిపదికన కొత్త జిల్లాల ఏర్పాటు చేయవద్దని నిరసనలు కూడా చెలరేగాయి. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ప్రజాభిప్రాయం మేరకు జిల్లా పునర్విభజన జరగాలని పలువురు ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో జిల్లా విభజన అంశంలో కొంత మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

నేడో, రేపో నోటిఫికేషన్‌..
కాగా కొత్త జిల్లాల ఏర్పాటు-పై రెవిన్యూ శాఖ తొలుత ప్రాధమిక నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఆ తర్వాత దానిపై సూచనలు, సలహాల కోసం 30 రోజులు గడువు ఇవ్వనుండగా.. వాటిన్నంటినీ పరిశీలించిన తర్వాత మార్పులు చేర్పులు చేసి తుది నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. తుది నోటిఫికేషన్‌లోనే కొత్త జిల్లాలు అమలులోకి వచ్చే అవకాశం లేకపోలేదు.

- Advertisement -
   

నియోజకవర్గ ప్రతిపాదన జరిగితే కర్నూలు నష్టమే..
నియోజకవర్గ ప్రాతిపదికన విభజన జరిగితే కర్నూలు కు నష్టమే అంటూ ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు గళమెత్తిన సంగతి విదితమే. ఇప్పటికే ఈ వ్యాఖ్యలను స్వాగతించిన మెజార్టీ నేతలు , ప్రజలు మరో సారి తెరపైకి వచ్చిన జిల్లాల విభజన వ్యవహారం రాజకీయ పార్టీలు , ప్రజాప్రతినిధుల వైఖరీ ఎలా ఉండబోతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విభజనపై జిల్లాలో చర్చోపచర్చలు జరిగే అవకాశం లేకపోలేదు. ఆశాస్త్రీయంగా జిల్లా విభజన జరిగితే అభివృద్ధి అంతా పక్క జిల్లా వరమైపోయి కర్నూలుకు మిగిలేది ఆర్థిక ఇబ్బంది లేనని గతంలో ప్రజలు నిరసన చేపట్టారు. ప్రస్తుతం నంద్యాల జిల్లాగా ప్రకటిస్తే నంద్యాల తో పాటు- ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూర్‌, బనగానపల్లి, డోన్‌ తో పాటు- కర్నూల్‌ పరిధిలోని కల్లూరు విలీనం కానుంది. అయితే నంద్యాలలో కలిసేందుకు కల్లూరు ప్రజలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే నిరసనలు చేపట్టారు.అదే జరిగితే కర్నూలు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుందన్న ఆందోళన ప్రజల్లో లేకపోలేదు. అంతేకాదు కర్నూలు పరిధిలోని ఓర్వకల్లు నంద్యాలలో కలవడం వల్ల ఇక్కడ ఏర్పాటు- చేసిన ఎయిర్పోర్ట్‌ , త్వరలో ఏర్పాటు- చేయబోయే ఇండస్ట్రియ్రల్‌ కారిడార్‌ నంద్యాల జిల్లాలో కి వెళుతుందా… కర్నూల్‌ లో ఉంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. నంద్యాల జిల్లా పరిధిలో కల్లూరు నియోజకవర్గంలో ఏర్పడితే.. పాణ్యం నియోజకవర్గం కనుమరుగు కానుంది.

ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే కర్నూలు,పత్తికొండ, కోడుమూరు,ఎమ్మిగనూరు, కౌతాళం,ఆదోని, ఆలూరు తో కలిసి జిల్లాగా ఏర్పడనుంది. అయితే కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ప్రాంతాలుగా గుర్తింపు ఉంది. ప్రతి ఏటా ఈ ప్రాంతాల నుంచి వలసలు ఎక్కువగా ఉంటాయి. కావున నూతనంగా ఏర్పడే కర్నూలు జిల్లాకు ఆర్థిక ఇబ్బందులు తప్పవన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విభజన వ్యవహారాలపై జిల్లాకి చెందిన ప్రజాప్రతినిధులు , రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించాలి. వీటిపై ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎలా స్పందిస్తారనేది కూడా అప్పుడే బయటపడుతుంది.

నంద్యాల జిల్లాలోని నియోజకవర్గాలు ఇవే..
1.ఆళ్ళగడ్డ,2. శ్రీశైలం,3. నందికొట్కూరు4. కల్లూరు,5. నంద్యాల,6. బనగానపల్లి,7. డోన్‌
కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాలు ఇవే

1. కర్నూలు 2. పత్తికొండ 3. కోడుమూరు4. ఎమ్మిగనూరు 5. కౌతాళం 6. ఆదోని 7. ఆలూరు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement