Thursday, April 25, 2024

పారామెడికల్ సిబ్బంది ఆకలికేకలు.. మూడు నెలలుగా అందని జీతాలు

చిత్తూరు జిల్లావ్యాప్తంగా కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్న సిబ్బందికి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్ లకు జనవరి నుంచి ఇప్పటివరకు జీతాలు రాక పోవడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 మంది ఉంటారు. జీతం పైనే ఆధారపడి తమ కుటుంబం పోషణ సాగుతుందని, గత మూడు నెలలుగా రాకపోవడంతో ఇంటి అద్దె కూడా ఇచ్చేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న డీఎస్సీ కాంట్రాక్టర్ పారామెడికల్ ఉద్యోగులకు మూడు నెలలు కావస్తున్నా నేటికీ జీతాలు అందక కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. గతంలో జిఓ నెంబర్ 10 ద్వారా 8,9 పి.ఆర్.సిలో వేతన సవరణ ద్వారా 100% గ్రాస్ శాలరీ తీసుకునే వీరికి జీవో నెంబర్ 27తో జీతాలు వర్తింపు చేయడంతో వేతనాల్లో తీవ్రంగా నష్టపోయారు. ఈ జీవో 27 సవరణ కోసం అనేక సార్లు ప్రభుత్వం అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించిన రద్దు చేస్తామని కాలయాపన చేస్తూ వచ్చారు. గత 20 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తమ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఆవేదన చెందుతున్నారు. వంద శాతం గ్రాస్ శాలరీతో నియామకమైన తమను డి.ఎ, హెచ్.ఆర్.ఎతో కూడిన 11వ పిఆర్సిలో వేతన సవరణ చేసి జీతాలు అందజేయాలని అనేకసార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా గతంలో డీఎస్సీ ద్వారా నియామకమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న హెల్త్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు. ఫార్మసిస్టులు.. గత 20 సంవత్సరాలుగా ఒకే చోట పనిచేస్తూ తమ కుటుంబాన్ని కూడా దూరంగా ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. కరోనా సమయంలోనూ తమ కుటుంబానికి దూరంగా ఉంటూ ప్రజలకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవలందించారు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, ఎం.ఎల్.హెచ్.పి.లుకు వీరు కాంట్రాక్ట్ పద్ధతిపై నా ఉద్యోగంలో చేరి ఆరు నెలలు గడవక ముందే వారికి బదిలీలు ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

దీనిపై పారామెడికల్ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా తాము కుటుంబాలకు దూరంగా ఉంటూ పనిచేస్తున్నామని తమకు కూడా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జిల్లాల పునర్విభజనలో తమకు అవకాశం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement