Wednesday, November 29, 2023

నిలిచిన పందికోన ప్రాజెక్టు పనులు.. చేతులెత్తేసిన కాంట్రాక్టర్‌..

కర్నూలు (ప్రభ న్యూస్‌): జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో వెనుకబడిన మండలాలకు సాగునీరు ఇచ్చేందుకు చేపట్టిన పందికోన జలాశయం పనులకు గ్రహణం పట్టింది. కాంట్రాక్టరు మధ్యలోనే చేతులు ఎత్తివేయడంతో పనులు నిలిచిపోయాయి. దీంతో 10,774 ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యం చతికిల పడింది. దీంతో రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి. పత్తికొండ, దేవనకొండ, కోడుమూరు పరిధిలోని కుడికాల్వ కింద 56,620 ఎకరాలు, ఎడమ కాల్వ కింద 10,774 ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు పందికోన జలాశయం నిర్మాణానికి 2007లో శ్రీకారం చుట్టారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్యాకేజ్‌19 కింద ఉన్న 10వేల ఎకరాల ఆయకట్టును కలిపేశారు. 1.126 టీఎంసీల నీటి సామర్థ్యంతో జలాశయం కుడి, ఎడమ కాల్వలు రూ.70కోట్లతో నిర్మించాలని మొదట నిర్ణయించారు. తర్వాత అంచనా వ్యయం రూ.125 కోట్లకు పెరిగింది. 80 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నా.. ప్రస్తుతం 0.7 టీఎంసీలు నిల్వచేయని పరిస్థిల ఉంది. ప్రధాన కారణం జలాశయం కట్ట రివేట్‌మెంట్‌ పూర్తికాకపోవడమే. పనులలో నాణ్యత నీరుగారింది. దీంతో 80వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా 15వేల ఎకరాలకు కూడా అందించలేదు.

పందికోన జలాశయపనులు 10 ఏళ్లుగా సాగుతుండటం, పాత ఆర్‌ఎస్‌ఆర్‌ ధరల ప్రకారం చేయాల్సి ఉండటంతో గిట్టుబాటు కాక గుత్తేదారుడు మధ్యలోనే చేతులెత్తేశాడు. ఫీల్డ్‌ ఛానల్స్‌కు సంబంధించి రూ.18కోట్లతో చేపట్టాల్సి ఉండగా అసంపూర్తిగా మిగిలాయి. చేసిన వాటిలో నాణ్యత తేలుతుండటం, ప్రస్తుతం గుత్తేదారుడిని 50సి నిబంధనల ప్రకారం తొలగించి మరొకరికి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినా ముందుకు వెళ్లడం లేదు. కుడి కాల్వ కింద రబీలో వేరుశనగ సాగుచేశారు. కాల్వ వ్యవస్థ లేకపోవడంతో ప్రధాన కుడికాల్వపై ఆయిల్‌ ఇంజన్లు పెట్టి నీటిని తీసుకువెళ్తున్నారు. ఎకరా పొలం తడవాలంటే ఆరు లీటర్లు ఖర్చవుతుందని రైతులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. వారానికి రెండుసార్లు పొలం తడిపితే రూ.40వేల వరకు ఖర్చవుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పందికోన ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసే లిఫ్ట్‌ పనిచేయకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

- Advertisement -
   

హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కాల్వ నుండి జిడిపికి వెళ్లే నీటిని ఎడమకాల్వకు మళ్లిస్తూ వస్తున్నారు. ఈ నీటిని నిలిపివేయడంతో పంటలు దెబ్బతింటున్నాయి. కళ్లముందు నీళ్లు ఉన్నా కాల్వలు లేక రైతులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అన్నదాతల కష్టాలు పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి పెట్టడం లేదు. హంద్రీనీవా సుజల స్రవంతి 29వప్యాకేజీలో చేపట్టిన పందికోన జలాశయం తీరుతో కర్షకులు కన్నీటి తడి పెడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా స్పందన లేదని అధికారులు మాట నీటి మూట అన్నవిధంగా ఉన్నారని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement