Friday, April 19, 2024

ఆపరేషన్‌ ‘ఆకర్ష్‌’ .. కొఠియా గ్రామాలపై ‘డ్వామా’ ప్రత్యేక దృష్టి..

విజయనగరం, ప్రభన్యూస్ : ఏవోబీ సరిహద్దు గ్రామాలు కావడం..ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లాకు సమీపంగా వుండడం..వెరసి ఏపీతో పోలిస్తే ఒడిశా ప్రభుత్వం ఆ గ్రామాలను సొంతం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగించిన వైనం తెలిసిందే. వివేక్‌ యాదవ్‌ కలెక్టర్‌గా వున్న సమయంలో కొఠియా గ్రామాల విషయంగా ఒక కదలిక తెచ్చినప్పటికీ మొన్నటి వరకు ఆ గ్రామాలపై ఒడిశా ప్రభుత్వ పెత్తనం చాపకింద నీరులా సాగింది. అయితే, పలు వివాదాస్పద/అపరిష్కృత అంశాలను పరిష్కరించుకోవడంలో భాగంగా ఇటీవల ఏపీ-ఒడిశా ముఖ్యమంత్రులు భువనేశ్వర్‌లో కలుసుకొని మాట్లాడిన తదుపరి కొన్నాళ్లు గడిచిన తర్వాత ‘ఒడిశా’ నెమ్మదించినట్లు పరిస్థితులు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధిహామీ పథకం ద్వారా కొఠియా గ్రామాల నిరుపేదలకు లబ్ధి చేకూర్చేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది.

వాస్తవానికి ఆయా గ్రామాల్లో ఆ పథకానికి సంబంధించి సిబ్బంది మునుపటి నుంచి వున్నప్పటికీ పథక లబ్ధి చేకూర్పులో నిర్లక్ష్యమే రాజ్యమేలింది. కానీ ఆ పరిస్థితుల్లో ఒక్కసారి మార్పు వచ్చినట్లయింది. డ్వామా పీడీ జి.ఉమాపరమేశ్వరి ఆధ్వర్యంలో కొఠియా గ్రామాల్లో ఉపాధి పథక లబ్ధి చేకూర్పునకు ప్రత్యేక కసరత్తు జరిపారు. పగులు చెన్నూరు, పట్టు చెన్నూరు, సారిక, గంజాయిభద్ర, కురుకూటి పంచాయతీల పరిధిలోని మధుర గ్రామాలు సహా అన్నింటా 622 కొత్త జాబ్‌ కార్డుల జారీకి రంగం సిద్ధం చేశారు. వాస్తవానికి గతంలో కూడా ఉపాధి జాబ్‌ కార్డులున్నప్పటికీ పథక లబ్ధి చేకూర్పు అలసత్వానికి గురైనట్లు పరిస్థితులు చాటిచెబుతున్నాయి.

కాగా, వ్యక్తిగత అభివృద్ధి పనులను కూడా ఇప్పటికే గుర్తించారు. అందులో భాగంగా గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది జిల్లా నీటి యాజమాన్యసంస్థ. నేలను చదును చేయడం, సరిహద్దు కందకాలు, కొత్త చెక్‌డ్యామ్‌లు, గ్రావెల్‌ రోడ్ల నిర్మాణం, చిన్న ఊటకుంటల ఏర్పాటు, గుళకరాళ్ల తొలగింపు తదితర 14 రకాల పనులు చేపట్టనున్నారు.

కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి ఆదేశాల మేరకు కొఠియా గ్రామాల్లో ఉపాధిహామీ పథక లబ్ధి చేకూర్పుపై దృష్టి సారించినట్లు డ్వామా పీడీ జి.ఉమాపరమేశ్వరి పేర్కొన్నారు. కొఠియా గ్రామాల్లో ఉపాథి కల్పన తదితర అంశాలపై ప్రభ ప్రతినిధి పీడీ వద్ద ప్రస్తావించగా ఆమె పై విధంగా స్పందించారు. త్వరలో 622 కొత్త జాబ్‌కార్డుల పంపిణీ చేపట్టడంతో పాటు కార్డుదారులందరికీ లబ్ధి చేకూర్పునకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement