Tuesday, March 26, 2024

హైవే కిల్లర్ మున్నా కేసు.. 12 మందికి ఉరిశిక్ష

ఏపీలో సంచ‌ల‌నం సృష్టించిన హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మొత్తం 18 మంది నిందితుల్లో 12 మందికి ఉరిశిక్ష, మరో ఆరుగురికి జీవిత ఖైదును విధిస్తూ 8వ అదనపు కోర్టు న్యాయమూర్తి జి.మనోహర్ రెడ్డి తీర్పు ఇచ్చారు. 2008లో జాతీయ రహదారిపై వాహనాలు చోరీ, డ్రైవర్ల హత్య వంటి పలు కేసులు ఈ మున్నా గ్యాంగ్‌పై ఉన్నాయి. 13 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో నిందితులు లారీ డ్రైవర్లు, క్లీనర్లను దారుణంగా హత్య చేశారని తేలడంతో.. ఒంగోలు జిల్లా కోర్టు ఈ గ్యాంగ్‌లోని ప్రధాన నిందితుడు మున్నాతో పాటు మరో 11 మందికి ఉరి శిక్ష విధించింది.

ప్రకాశం జిల్లాలో 2008లో హైవే కిల్లర్ మున్నా కేసు సంచలనం రేకెత్తించింది. మున్నా గ్యాంగ్ జాతీయ రహదారిపై లారీలు ఆపి 13మంది డ్రైవర్లు, క్లీనర్లని హత్య చేసింది. ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీలను టార్గెట్ చేసి డ్రైవర్, క్లీనర్లని చంపి లారీలు ఎత్తుకెళ్లేవారు. ఇందుకు సంబంధించి 4 కేసుల్లో 18 మందిపై నేరం రుజువైంది. ఈ హత్య కేసుల్లో 18 మందిని నిందితులు‌గా కోర్టు నిర్ధారించింది. 2008లో ఈ ముఠా పాల్పడిన దారుణాలపై జిల్లాలోని ఒంగోలు తాలుకా, సింగరాయకొండ, మద్దిపాడు పోలీస్‌ స్టేషన్లలో ఆరు కేసులు నమోదు చేశారు. వీటిలో నాలుగు కేసుల్లో మున్నాతో పాటు 18 మందిపై నేరం రుజువైనట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. వీరంతా దారిదోపిడీలు, హత్యలకు పాల్పడినట్లు నిర్ధారించారు. మహమ్మద్ జమాలుద్దీన్, ఎస్‌కె ఖాదర్‌బాషా, తమ్మల సురేష్, కె అప్పలస్వామి నాయుడు తదితరులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు.

పశ్చిమ బెంగాల్‌ దుర్గాపూర్‌ నుంచి ఇనుప రాడ్ల లోడ్‌తో తమిళనాడులోని కల్పకంకు బయలుదేరిన లారీతోపాటు డ్రైవర్, క్లీనర్‌ అదృశ్యమయ్యారు. దీంతో 2008 అక్టోబర్‌ 17న లారీ యజమాని వీరప్పన్‌ కుప్పుస్వామి ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పాత ఇనుము వ్యాపారులపై ప్రత్యేక నిఘా పెట్టారు. సయ్యద్‌ అబ్దుల్‌ సమద్‌ అలియాస్‌ మున్నా కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 20కి పైగా సిమ్‌ కార్డులు మార్చి దేశం వదిలి పారిపోయేందుకు ప్రయత్నించిన మున్నాను కర్ణాటకలోని అరెస్ట్ చేశారు. ఎట్టకేలకు నిందితులకు ఉరి శిక్ష విధిస్తు ఒంగోలు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

ఇదీ చదవండి: కరోనా నేర్పిన గుణపాఠం.. ఇల్లు ఎలా ఉండాలి?

Advertisement

తాజా వార్తలు

Advertisement