Thursday, April 18, 2024

108 కాపాడుతున్న ప్రాణాలు నెల‌కు ల‌క్ష‌

అమరావతి, ఆంధ్రప్రభ:ఆపదలో ఉన్నప్పుడు కుయ్‌.. కుయ్‌ మంటూ రివ్వున వస్తున్న 108 సర్వీస్‌లు నెలకు లక్షమందికి ప్రాణదానం చేస్తున్నాయి. 108 సర్వీసులకు కి సంబంధించి 768 అంబులెన్స్‌లు ఉన్నాయి. ఇందులో 432 అంబులెన్స్‌ లు కొత్తవి. గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో, పట్టణ ప్రాంతాల్లో 15 నిమిషాల్లో గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో 108 సేవలు అందుబాటులోకి రావాలనే నిబంధన ఉండగా కేవలం 16,14,22 నిమిషాల్లోనే 108 అంబులెన్స్‌లు ప్రత్యక్షం అవుతున్నాయి. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స అందుతుండటంతో క్షతగాత్రుల ప్రాణాలు కాపాడటం సాధ్యం అవుతోంది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో 440 అంబులెన్స్‌లు ఉంటే అందులో 336 మాత్రమే పనిచేసేవి. లక్షా ఇరవై వేల మంది జనాభాకు ఒక అంబులెన్స్‌ పనిచేసేది. 86 అంబులెన్స్‌ల్లో మాత్రమే అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌ వ్యవ స్థ ఉండేది. అందులో అడ్వాన్స్‌డ్‌ వెహికిల్‌ లొకేషన్‌ సిస్టమ్‌ మొబైల్‌ డేటా టర్మినల్‌ కూడా ఉండేది కాదు.

వైసీపీ ప్ర భుత్వ హయాంలో 74 వేల మందికి ఒక అంబులెన్స్‌ అందుబాటులో ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యశాఖపై ప్రత్యేక దృష్టిసారించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 440 ఉన్న అంబులెన్స్‌ల సంఖ్య 2022 నాటికి 768కి చేరింది. వీటిల్లో 2020లో 412 కొత్త అంబులెన్స్‌లను వైసీపీ ప్రభుత్వమే కొనుగోలు చేసింది. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల్ని మెరుగుపర్చడంలో భాగంగా 20 కొత్త అంబులెన్స్‌ల్ని కేటాయించింది. ప్రస్తుతం ఉన్న వాటిలో 336 అంబులెన్స్‌లు పాతవి కావడంతో వాటిని మార్చేందుకు ఈనెల 11న వైద్యశాఖ జీవోను జారీ చేసింది. తొలి విడత 146 అంబు లన్స్‌లు కొనుగోలు చేసేందుకు టెండర్‌ ప్రక్రియను త్వరలో నిర్వహించనున్నారు. టీడీపీ హయాంలో 292 ఎంఎంయూ వాహనాలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 656కు చేరింది. సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్‌లో నెలలో 26 రోజుల పాటు ఇవి సేవలు అందిస్తున్నాయి. ఈ ఏడాది ఉగాది నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న 104 సేవల్లో భాగంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు 104 ద్వారానే సేవలు అందించనున్నట్లు వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈఓ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ వెల్లడించారు. 108, 104 వాహనాల పనితీరుపై ఎప్పటి కప్పుడు వైద్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ కమిషనర్‌ జె.నివాస్‌ ఆరా తీస్తూ సిబ్బందికి దిశా నిర్ధేశం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement