Wednesday, April 17, 2024

Big Story: నోరూరించే బందరు లడ్డూ.. అసలు కథేంటో తెలుసా!

(ప్రభన్యూస్ బ్యూరో – కృష్ణా)

ఇంగ్లిషు వారి పాలనలో కృష్ణా జిల్లాలోని బందరు ఏరియాకు ఒక విశిష్టత ఉండేది. అప్పట్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రాంతం గుర్తింపు పొందింది. ఇప్పుడైతే బందరు పేరు చెప్పగానే అందరి మదిలో మెదిలేవి బందరు లడ్డూ, కలంకారి వస్త్రాలు, చిలకలపూడి రోల్డ్ గోల్డ్ వస్తువులు. కానీ, బందర్ లడ్డూకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్​ ప్రపంచంలోనే అప్పట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో చాలా పట్టణాల్లో బందరు మిఠాయి దుకాణం అనే  బోర్డులు కూడా కనిపిస్తాయి. బందరు మిఠాయిగా గుర్తింపు పొందడానికి బందరు లడ్డూనే ప్రధాన కారణమని అంతా చెబుతారు.

ఒకసారి బందరు లడ్డూ చరిత్రను పరిశీలిస్తే..175 సంవత్సరాల క్రితం  సింగుల కుటుంబాలు బందరులో స్థిరపడ్డాయి. వారే బందరు లడ్డూల సష్టికర్తలుగా చెపుతారు. బొందిలీలు అని కూడా పిలిచే సింగుల కుటుం బాలు బందరులో ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి. వీరిలో ఎవరు ఇప్పుడు ఈ లడ్డూల తయారీలో కానీ, ఈ వ్యాపారంలో కానీ లేరు. ఆ కుటుం బాల వద్ద పనిచేసి లడ్డూ తయారీ నేర్చుకున్న ఒకటి రెండు కుటుంబాలలో ఒక కుటుంబం ఇప్పటికీ ఆ వ్యాపారాన్ని విడచిపెట్టలేదు. అందుకే బందరు లడ్డూ అనగానే బందరులో టక్కున శిర్విశెట్టి సత్యనారాయణ కేరాఫ్‌ తాతారావు పేరు చెపుతారు.

ఈ తాతారావును ఇప్పటికీ మిఠాయి కొట్టు తాతారావుగానే పిలుస్తుంటారు. ఆరు నెలల క్రితమే ఆయన మృతి చెందారు. గత 50 ఏళ్లుగా ఆయన కుటుంబ సభ్యులు ఈ వ్యాపారంలో ఉన్నారు. తాతారావు  కుటుంబంతో పాటు పలువురు బందరు లడ్డూ తయారు చేస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకు వస్తున్నారు. బందరు లడ్డూను తొక్కుడు లడ్డూ అని కూడా అంటారు. స్వచ్ఛమైన శనగపిండి నుండి ముందు పూస తీస్తారు. దాని నాణ్యతలో ఎక్కడా రాజీలేకుండా ఘుమఘు మలాడే అతి స్వచ్ఛమైన నేతితో వేయించి ఆ తరువాత దంచుతారు. దాన్నలా ఉంచి సరైనపాళ్లలో బెల్లం పాకం తయారు చేస్తారు. ఆ పాకాన్ని దంచుతున్న పొడిలో పోస్తూ తొక్కుతారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి సుమారు 9 గంటలు పడుతుంది. సరైన పక్వానికి వచ్చిన దశలో యాలకులు, పటికబెల్లం చిన్నచిన్న ముక్కలుగా చేసి కలిపి ఆ తరువాత లడ్డూలుగా చుడతారు. ఆ విధంగా తయారైన లడ్డూ 20 రోజులపాటు నిల్వ ఉంటుం ది. ఈ లడ్డూలో ఎటువంటి రంగు, రసాయనాలు కలుపరు. అదండీ బందరు లడ్డూ ముచ్చట.. దాని చరిత్ర..  

Advertisement

తాజా వార్తలు

Advertisement