Thursday, April 25, 2024

బట్టీల్లో కాగుతున్న కాపుసారా.. పోలీస్‌ దాడులు జరుగుతున్నా ఆగని తయారీ, విక్రయాలు

కృష్ణా, ప్రభన్యూస్ : గ్రామాల్లో, పట్టణాల్లో కాపుసారా ఏరులై పారుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలనే లక్ష్యంతో మద్యం షాపులు తగ్గించి, మద్యం ధరలను భారీగా పెంచింది. దీంతో కాపుసారా తయారీ, విక్రయాలు ఊపందుకున్నాయి. మరోవైపు కాపుసారా తయారీ, విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్న అక్రమార్కులు బరితెగిస్తున్నారు. కేసులు నామమాత్రంగా ఉండటంతో ఎన్నిసార్లు అరెస్టులు అయినా మళ్లి కాపుసారా తయారీ చేస్తున్నే ఉన్నారు. ముఖ్యమంత్రి ఆశయానికి తూట్లు పొడిచే విధంగా వైకాపా నాయకుల అండ ఉండడంతో యథేచ్ఛగా సారా తయారు చేస్తున్నారు. అక్రమ మద్యం, కాపుసారా తయారీ, అమ్మకాల నియంత్రణకు ప్రభుత్వం స్పెషల్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ బ్యూరోను ఏర్పాటు చేసింది. పోలీసులతో కలిసి పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తుంది. అయినా అక్రమార్కులు అధికార పార్టీ నేతల అండదండలతో గ్రామాల్లో కాపుసారా తయారు చేస్తున్నారు. కొంతమంది అధికార పార్టీ నేతలు కాపుసారా తయారీ దారుల నుంచి నెలవారీ ముడుపులు వసూలు చేసుకుంటూ వారికి అండగా నిలుస్తున్నారు. గతంలో బెల్ట్‌ షాప్‌ ల ద్వారా మద్యం విక్రయించిన వారిలో కొందరు నేడు కాపు సారా తయారీ చేస్తున్నట్లు సమాచారం.

మద్యం షాపుల యజమానులు గతంలో ఎక్సైజ్‌ అధికారులను సహకారంతీసుకుని నేరుగా కాపుసారా బట్టీలను ధ్వంసం చేసేవారు, ఎవరైనా విక్రయిస్తున్న వారిపై దాడులు చేసేవారు. నేడు ప్రభుత్వమే మధ్యం షాపులు నిర్వహిస్తుండటంతో కాపుసారా తయారీ, విక్రయాలను ఆదుపు చేసే బాధ్యత పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగంపై పడింది. జిల్లాలో కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గూడూరు, మచిలీపట్నం, కైకలూరు, మండవల్లి, కలిదిండి, నాగాయలంక, కోడూరు, విస్సన్నపేట, రెడ్డిగూడెం, చాట్రాయి, ఏ కొండూరు, నందిగామ, చందర్లపాడు, కృష్ణా నది పరివాహక లంక గ్రామాల్లో, తదితర ప్రాంతాల్లో కాపుసారా తయారీ కొనసాగుతోంది.

గ్రామాల్లో తయారైన కాపుసారా పట్టణాలకు, ఇతర జిల్లాలకు రవాణా చేస్తున్నారు. మద్యం షాపులు తగ్గించడం, మద్యం ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కొంతమందికి ఆదాయ మార్గంగా మారింది. సారా తయారీ మళ్లీ ఊపందుకుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా పలు ప్రాంతాల్లో నిరంతరాయంగా కాపుసారా తయారవుతుంది. పట్టణ ప్రాంతాలలో కుక్కర్ల సహాయంతో కాపు సారా తయారు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాపుసారా తయారీ లో ప్రమాదకర వస్తువులు వినియోగిస్తూ ఉండడంతో తాగే వారి ఆరోగ్యానికి హాని చేస్తుందని చెపుతున్నారు. నల్ల బెల్లం, కుళ్లిన పండ్లు, బ్యాటరీలు, విడిచేసిన చెప్పులు, అమోనియా, యూరియా, నవాసారం, పటిక తదితర వస్తువులు వినియోగిస్తారు. కిక్కు కోసం ఎండిమిర్చి వాడతారు. ఈ వస్తువులు అన్నీ కలిపి 15 రోజుల పాటు భూమిలో పాతిపెట్టి ఉంచుతారు. అనంతరం పొయ్యిమీద పెట్టి కాస్తారు. ప్రమాదకర వస్తువులతో కాపు సారా తయారు చేయడం వల్ల దానిని తాగిన వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపెడుతుంద టున్నారు. గతంలో కాపుసారా ఎందరో యువకులు మృత్యువాత పడ్డారు. కల్తీ కాపు సారా తాగి మృతి చెందిన సంఘటనలో గతంలో జిల్లాలో చోటుచేసుకున్నాయి. వెలుగులోకి రాని కేసులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు బజారున పడ్డాయి.

కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. మళ్లీ కాపుసారా తయారీ పెద్ద ఎత్తున జరుగుతుండటంతో గ్రామాల్లో యువతపై తీవ్ర ప్రభావం చూపెడుతుందని చెబుతున్నారు. కాపుసారా తయారీ నియంత్రణపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు. పక్క రాష్ట్రాల్ర నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని, జిల్లాలో తయారవుతున్న కాపు సారాను పూర్తిస్థాయిలో నియంత్రించగలిగితే ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement