Friday, April 19, 2024

నామమాత్రంగా స్వచ్ఛభారత్‌ మిషన్‌.. ఇంకెన్నాళ్లిలా పల్లె కష్టాలు..

కర్నూలు, (ప్రభన్యూస్‌) : పల్లెల్లో స్వచ్ఛత సేవ కథ కంచికి చేరింది. బహిరంగ మల విసర్జనతో పరిసరాల పరిశుభ్రత లోపిస్తున్నది. దాదాపు 13 లక్షల కుటుంబాలు ఉండగా, స్వచ్ఛభారత్‌లో భాగంగా అప్పట్లో 3.11ల క్షలకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేశారు. వాటిలో 500 గ్రామాలను ఓడీఎఫ్‌ గ్రామాలుగా గుర్తించారు. నాణ్యత లోపాలు, అసంపూర్తి పనులతో కొన్ని నిర్మాణాలు ఇప్పటికీ పూర్తిచేయలేదు. పల్లెల్లో ఇప్పటికీ ఓ సర్వే ప్రకారం 90 శాతంకు పైగా జనం వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించుకోవడం లేదు. దీంతో ఎక్కడ చూసినా పరిశుభ్రత లోపిస్తున్నది.

జిల్లాలో గత ఏడాది స్వచ్చభారత్‌ మిషన్‌లో భాగంగా ప్రచార రథాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేసి 54 మండలాల్లో 974 పంచాయతీల్లో అవగాహన కల్పించాలని అప్పటి జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ జిల్లా ఆర్‌డబ్ల్యుఎస్‌ యంత్రాంగంతో కలిపి ప్రారంభించారు. ముఖ్యంగా ప్రజా సామూహిక మరుగుదొడ్లను వాడండి .. వాటిని పరిశుభ్రంగా ఉంచండి, మరుగుదొడ్లు వాడుదాం.. మహిళల ఆత్మగౌరవం నిలుపుదాం, స్వచ్ఛత సేవ మనం మన పరిశుభ్రత, మన ఊరి భద్రత మనందరి బాధ్యత అని ప్రత్యేకంగా పిలుపునిచ్చినప్పటికీ జిల్లాలో ఆ ప్రచార రథం మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసింది.

అనంతరం ఆ ప్రచార రథం ఎక్కడా కనపడక మాయమైపోయింది. తడి, పొడి చెత్తలను వేరుచేయకుంటే 2015 గణ వ్యర్థాల నియమ, నిబంధనల ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం, రోడ్డు, కాల్వలపైన కానీ తడిచెత్త పారవేయడం నేరం, మన ఇంటిలో ఉత్పత్తి అయ్యే తడి, పొడి చెత్తలను వేరుచేయడం మనందరి బాధ్యత అని అవగాహన కల్పించాల్సిన ఆర్‌డబ్ల్యుఎస్‌ యంత్రాంగం దానివైపు దృష్టి పెట్టకపోవడం గమనార్హం. జిల్లాలో స్వచ్ఛత సేవ కార్యక్రమాన్ని అమలుచేయాల్సిన గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ కాలక్షేపంతో ముందుకు వెళ్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడం లేదు. మూడు లక్షలకు పైగా మరుగుదొడ్లు మంజూరు చేసినా వాటిలో 50 శాతం కూడా ప్రగతి సాధించకపోవడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement