Tuesday, March 26, 2024

హెచ్‌3 ఎన్‌2 వైరస్‌ వ్యాప్తిపై ఆందోళన అవసరం లేదు.. దీర్ఘకాలిక రోగులకు చికిత్సతో ఉపశమనం

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రస్తుతం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న హెచ్‌3 ఎన్‌2 వైరస్‌ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇది ఒక వైరల్‌ ఇన్ఫెక్షన్‌ అని వైద్య విద్య డైరక్టర్‌ (డీఎంఈ) డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ వెల్లడించారు. గురువారం విజయవాడలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెచ్‌3 ఎన్‌2 వైరల్‌ ఇన్ఫెక్షన్‌ ఇంక్లూయంజా ఎ టైప్‌ వేరియంట్‌ ద్వారా వ్యాప్తి చెందుతుందని ఇది ముక్కు నుంచి ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుందని వివరించారు. బాగా రద్దీగా ఉండే ప్రదేశాలు, క్లాస్‌ రూమ్‌లు, ఆఫీసుల్లో ఇది ఎక్కువగా ప్రభావం చూపుతుందని దగ్గు, తుమ్ము ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. రాష్ట్రంలో జనవరి నుంచి ఇప్పటి వరకు 21 కేసులు నమోదయ్యాయని చెప్పారు. తిరుపతి వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌లో 12 కేసులు జనవరిలో నమోదు కాగా ఫిబ్రవరిలో మరో 9 పాజిటివ్‌గా నిర్థారణ అయ్యాయని వెల్లడించారు.

ఈ వైరస్‌ సోకిన వ్యక్తికి తీవ్ర జ్వరంతో పాటు గొంతు నొప్పి, దగ్గు, ముక్కులు కారడం, కళ్ల నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. ఆరోగ్య వంతులకు ఈ వైరస్‌ సోకితే కేవలం మూడు, నాలుగు రోజుల్లోనే తగ్గిపోతుందని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు చికిత్సతో నయమవుతుందని వినోద్‌ కుమార్‌ వెల్లడించారు. ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాలు వినియోగించే వారు ఈ వైరస్‌ బారిన పడుతున్నారని వీరిలో వైరస్‌ ప్రభావం ఎక్కువ రోజులు చూపిస్తుందని వివరించారు. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే న్యుమోనియాకు దారి తీయవచ్చని తెలిపారు. ఈ వైరస్‌ సోకిన వారు పారాసిట్‌మాల్‌, బ్రూఫిన్‌ వంటి ట్యాబ్‌లెట్లను వినియోగించవచ్చని ఈ చికిత్సతో పాటు ఓఆర్‌ఎస్‌, పండ్ల రసాలు, ఎక్కువ నీరు సేవించాల్సి ఉంటుందని అప్పుడే త్వరగా ఉపశమనం లభిస్తుందని చెప్పారు.

- Advertisement -

తీవ్రత అధికంగా ఉంటే ఓసెల్టామివిర్‌ 75 ఎంజీ ట్యాబెలెట్‌ను రోజుకు రెండుసార్లు వినియోగించాల్సి ఉంటుందని ఈ మందులన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని డీఎంఈ చెప్పారు. దగ్గు, జలుబు, తుమ్ములు లక్షణాలు ఉన్న వారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని సూచించారు. యాంటీబయోటిక్స్‌ అధికంగా వినియోగించవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా చిన్నారులకు ఈ లక్షణాలు ఉంటే స్కూళ్లకు పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు. మందులతో పాటు తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరమని సూచించారు. ఈ సమావేశంలో సిద్ధార్ధ మెడికల్‌ కళాశాఖ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుధాకర్‌, జీజీహెచ్‌ సూపరిండెంట్‌ డాక్టర్‌ ఎస్‌ రఘు తదితరులు పాల్గొన్నారు.

14న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో నులిపురుగుల నివారణ మందు పంపిణీ..

జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 14వ తేదీన అన్ని పాఠశాలలు, కళాశాలల్లో 1 నుంచి 19 సంవత్సరాల చిన్నారుల, వయోజనులకు నులి పురుగుల నివారణ మందులను పంపిణీ చేయనున్నట్లు ఆరోగ్య మిషన్‌ డైరక్టర్‌ జె. నివాస్‌ తెలిపారు. గురువారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో నులి పురుగుల వ్యాప్తి ప్రాణాంతకంగా మారిన దేశాల్లో మన దేశం కూడా ఉందని ఈ అంశాన్ని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలు, జూనియర్‌ కళాశాలలు, సాంకేతిక విద్యా సంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆల్‌బెండజోల్‌ మందులను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 54 వేల 844 మంది ఉపాధ్యాయులు, 55 వేల 607 అంగన్‌వాడీ వర్కర్లు, 15 వేల మంది ఏఎన్‌ఎంలు, 41 వేల మంది ఆశావర్కర్లకు పూర్తి శిక్షణ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement