Friday, March 29, 2024

ఫండ్స్​ లేవు, పనులు జరగవు.. పనిచేయని చెక్​డ్యామ్​లు, సాగునీరు అందని గిరిజన రైతులు..

గుమ్మలక్ష్మీపురం, (ప్రభ న్యూస్‌) : పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని జీఎల్‌పురం, కురుపాం ఏజెన్సీ మండలాల్లో గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిక చెక్‌డ్యాములు ప్రస్తుతం నిర్వహణ లోపంతో శిథిలమై దర్శనమిస్తున్నాయి. పంట పొలాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన చెక్‌ డ్యాములు పట్ల నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుంది. ఈ చెక్‌ డ్యాములు నిర్మించిన మొదట్లో సక్రమంగా పని చేసినప్పటికీ, ప్రస్తుతం నిర్వహణ లోపంతో కొంతకాలానికే పడకేశాయి. ఏజెన్సీ ప్రాంతంలో పాడైన చెక్‌ డ్యామ్‌లకు సంబంధిత అధికారులు మరమ్మత్తులు చేపట్టి, గిరిజన రైతుల పంట పొలాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం నిర్లక్ష్యమైంది. గతంలో జీఎల్‌పురం, కురుపాం మండలాల్లో కొత్తగూడ, వం గర, కేసర, గూడ, డుమ్మంగి, పి.ఆమిటి, జి.శివడ, కాకిలి, చాపరాయిగూడ తదితర ప్రాంతాల్లో మైనర్‌ ఇరిగేషన్‌, పీటీజీ, ఉపాధి హామీ నిధులతో చెక్‌ డ్యాముల నిర్మాణాలను చేపట్టారు. వీటిపై దృష్టి సారించి మరమ్మత్తు పనులు చేపట్టకపోవడంతో ఇవి శిథిలమయ్యాయి. ఈ మేరకు జీఎల్‌పురం మండలంలో సీమలగూడ మిని రిజర్వాయర్‌ అభివృద్ధికి ఇప్పటి వరకు మూడుసార్లు ప్రతిపాదనలు చేసినా, అధికారులు నిర్మాణ పనులు చేపట్టలేదు. ఈ సీమల గూడ రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ. 3కోట్లతో ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి.

ఈ రిజర్వాయర్‌ అభివృద్ధిలోకి తీసుకువస్తే సమీప ప్రాంతాలలోని 1800 ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుంది. లోవముఠా ప్రాంతంలో ఉన్న గాండ్ర గ్రామ సమీపాన ఉన్న మరో మిని రిజర్వాయర్‌ పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. దీంతో వందలా ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి. ఈ కారణంగా గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగునీరు అందుబాటులో ఉంటే ఖరీఫ్‌తో పాటు కొద్దొ గొప్పా రబీ పంటలు కూడా వేసుకోవచ్చునని గిరిజన రైతులు తెలిపారు. రైతులకు వ్యవసాయం ద్వారా ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి, గిరిజన ప్రాంతంలో పాడైన సాగునీటి వనరులపై దృష్టి సారించి, మరమ్మత్తులు చేపట్టడం ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించాలని గిరిజన రైతులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement