Tuesday, April 23, 2024

నెల్లూరు జిల్లాలో భూ”మాఫియా” – పోరంబోకు భూముల‌కు రెక్క‌లు

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: భూ స్కాం లకు వేదికగా మారుతున్న నెల్లూరు జిల్లాలో మరో భారీ భూ కుంభకోణానికి పెద్దలు తెర వెనుక స్కెచ్‌ వేశారు. ఇప్పటికే అందుకు సంబం ధించిన పది ఎకరాల భూములకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా పూర్తయింది. మేత పోరంబోకు భూములకు రిజిస్ట్రేషన్లు చేయడం ఎమిటా అని ఆరా తీస్తే అసలు బాగోతం వెలుగులోకి వచ్చిం ది. సుమారు రూ. 50 కోట్లకుపైగా విలువైన 435 ఎకరాల ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్లు చేయించేందుకు భూ మాఫియా తెరవెనుక పెద్ద ఎత్తున ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అందుకు రెవెన్యూ అధికారులు కూడా పరోక్షంగా సహకారాన్ని అందిస్తున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ భూ దోపిడీకి సంబంధించి వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం మండల కేంద్రానికి కూతవేటు దూరంలో జాతీయ రహదారి నిర్మాణానికి అనుమతులొచ్చాయి. సింగరాయకొండ నుండి మైదుకూరు వరకూ ఆరు లేన్ల జాతీయ రహదారిని నిర్మించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అందు కు సంబంధించి సర్వే పనులు చేపడుతున్నారు. దీంతో సీతారాంపురం గ్రామ పరిధిలోని సర్వే నంబరు 1లో ఉన్న 435.2 ఎకరాల మేత పోరంబోకు భూములపై గద్దల కన్ను పడింది. అంతకుముందే ఆ భూములకు సంబంధించి కొంత మంది దొడ్డిదారిన పట్టాలు కూడా పొందినట్లు చెబుతున్నారు. జాతీయ రహదారి రాకతో అందుకు సంబంధించి 10 ఎకరాల భూములను ఇటీవల ఉదయగిరి సబ్‌ రిజిస్ట్రార్‌ఒ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ కూడా చేశారు. దీంతో గతంలో రహస్యంగా పట్టాలు పొందిన మరికొంత మంది ఆ భూములను విక్రయించి రిజిస్ట్రేషన్లు జరిపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు స్థానిక రిజిస్ట్రేషన్‌ అధికారులు నిరాకరించడంతో ఈ భూ మాయ వెలుగులోకి వచ్చింది.

రూ. 50 కోట్ల విలువైన మేత పోరంబోకుపై మాయాజాలం :
నెల్లూరు జిల్లాలో ఉయగిరి నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. అయితే, ఇటీవల ఏర్పేడు – హైదరాబాద్‌ మధ్య ఉదయగిరి నియోజకవర్గం మీదుగా జాతీయ రహదారిని నియమించారు. దీంతో నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారికి సమీపంలో ఉండే భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కొంతమంది పెద్దలు గద్దలుగా మారి ప్రభుత్వ భూములను తన్నుకుపోతున్నారు. అందులో భాగంగానే సీతారంపురం సర్వే నంబరు 1లోని 435.2 ఎకరాల మేత పోరంబోకు భూమికి ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. అయితే, గడచిన ఏడాదికాలంగా ఆప్రాంతంలో జాతీయ రహదారి రాబోతోందని ప్రచారం జరగడంతో ఆయా ప్రాంతాలకు చెందిన కొంతమంది బడా బాబులు రెవెన్యూ అధికారులతో చేతులు కలిపి ఆ భూములను సొంత భూములుగా మార్చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వివిధ మార్గాల్లో పట్టాలు పొందిన వారంతా ఆ భూములను విక్రయించే పనిలో పడ్డారు. అందుకు వెబ్‌ లాండ్‌లో ఆటంకాలు లేకుండా ఆ భూములను 22(ఏ) కింద చూపించకుండా ఉండేలా తెరవెనుక అధికార బలాన్ని ఉపయోగించి చేసిన ప్రయత్నాలు కొంతమేర ఫలించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ భూముల ధరలకు అమాంతంగా రెక్కలొచ్చాయి. నిన్నమొన్నటి వరకూ ఎకరా లక్ష, రెండు లక్షల వరకే పలికిన ధర నేడు రూ. 10 లక్షలు దాటిపోయింది. పైపెచ్చు జాతీయ రహదారి నిర్మాణం కూడా జరగబోతుండటంతో ఆయా ప్రాంతాలకు చెందిన కొంత మంది సీతారంపురం భూములను కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. దీంతో ఆ భూములకు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం ఉన్న బహిరంగ మార్కెట్‌ ధర ప్రకారం ఆ భూముల విలువ రూ. 50 కోట్ల వరకూ పలుకుతుంది.

22(ఏ)లో చూపని వైనం :
సాధారణంగా ప్రభుత్వ భూములను 22(ఏ) కింద చూపించాలి. గతంలో ఏదైనా కారణాలచేత ఆ భూములకు పట్టాలిచ్చి ఉన్నా వాటిని రద్దుచేసి నిషేధిత జాబితాలోనే చూపించాలి. అయితే, సీతారంపురంలోని సర్వే నంబరు 1లో గల 435.2 ఎకరాల భూములకు సంబంధించి నిషేధిత జాబితాలో చూపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రెవెన్యూ అధికారులు పథకం ప్రకారమే 22(ఏ)లో నమోదు చేయలేదా..మరేదైనా సాంకేతిక కారణాలతో చూపించలేకపోయారా..అనేది స్పష్టత లేదు.

విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. గండిపాలెం ముంపు భూములకు పట్టాలు :
ఉదయగిరి మండల పరిధిలో గండిపాలెం రిజర్వాయర్‌ఒ ఉంది. 1974లో ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే మండల పరిధిలోని కృష్ణంపల్లి గ్రామానికి చెందిన సుమారు 300 ఎకరాల భూములు ముంపునకు గురవుతున్నాయని గుర్తించారు. అప్పట్లోనే ఆ భూములకు సంబంధించి రైతులకు నష్టపరిహారం చెల్లించారు. వారికి వెంగళరావు నగర్‌లో ప్రత్యామ్నాయంగా పునరావాసం కల్పించారు. అయితే, గండిపాలెం రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయినప్పటికీ పూర్తిస్థాయి నీటితో నిండిన సందర్భాలు చాలా తక్కువ. కేవలం వర్షాధారంతోనే రిజర్వాయర్‌ నిండాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా భూములు అలాగే బీడుగా మారాయి. దీంతో కొంతమంది అధికారపార్టీకి చెందిన నేతలు ఆ భూములను సాగుచేసుకుంటున్నారు. ఇటీవల అయితే, ఓ పెద్దమనిషి సుమారు 150 ఎకరాల ముంపు భూములకు పట్టాలు కూడా సృష్టించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో పరిహారం చెల్లించి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ముంపు భూములకు పట్టాలు ఇవ్వడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించి కూడా ఉన్నతాధికారులు విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడే అవకాశాలు లేకపోలేదు.

10 ఎకరాలకు రిజిస్ట్రేషన్‌ చేశాం : ఉదయగిరి సబ్‌రిజిస్ట్రార్‌
సీతారంపురం మండల పరిధిలోని సర్వే నంబరు 1లోని 10 ఎకరాలకు సంబంధించి ఇటీవలే రిజిస్ట్రేషన్‌ చేసినట్లు ఉదయగిరి సబ్‌రిజిస్ట్రార్‌ రమేష్‌ తెలిపారు. అయితే, ఆ భూములు 22(ఏ)లో ఉన్నట్లు చూపించనప్పటికీ సర్వే నంబరు 1 ప్రభుత్వ భూమి కాబట్టి రిజిస్ట్రేషన్‌ మొదట పెండింగ్‌ పెట్టామన్నారు. అయితే, సంబంధిత వ్యక్తులు కోర్టుకు వెళ్లడంతో ఆమేరకు రిజిస్ట్రేషన్‌ చేయాల్సి వచ్చిందని తెలిపారు.

ఉన్నతాధికారులకు తెలియజేశాం : ఇన్‌ఛార్జి తహశీల్దార్‌
సీతారంపురం భూములకు సంబంధించిన విషయాన్ని తాను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ షాజియా చెప్పారు. అవి మేత పోరంబోకు భూములైనప్పటికీ 22(ఏ)లో చూపించకపోవడం విషయాన్ని కూడా పై అధికారులకు చెప్పామన్నారు. వారి నుండి ఆదేశబుూలు వచ్చాకే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement