Tuesday, April 16, 2024

నెల్లూరు జిల్లాలో రెండు సర్పంచ్‌, 29 వార్డులు ఏకగ్రీవం

నెల్లూరు జిల్లాలో వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగకుండా ప్రస్తుతం ప్రారంభమైన సర్పంచ్‌, ఎంపీటీసీ, వార్డు మెంబర్ల ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఉపసంహరణ పర్వం పూర్తయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు తెలియజేశారు. ఎన్నికలు జరగాల్సిన నాలుగు ఎంపీటీసీ స్థానాలకు 12 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని తెలిపారు. కోవూరు మండలం గంగవరం ఎంపీటీసీ స్థానానికి ముగ్గురు, సైదాపురం మండలం అనంతమడుగు స్థానానికి ఇద్దరు, బాలాయపల్లి మండలం వెంగమాంబపురం స్థానానికి నలుగురు, కోట మండలంలోని కోట బిట్‌ – 2 స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారని తెలిపారు.
రెండు సర్పంచ్‌ , 29 వార్డులు ఏకగ్రీవం :
ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరగాల్సిన 27 మండలాల్లోని 35 పంచాయతీలకు సంబంధించి రెండు సర్పంచ్‌, 37 వార్డులకు ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగిసిందని ఆయన తెలిపారు. సర్పంచ్‌ పదవులకు సంబంధించి నెల్లూరు మండలం సజ్జాపురం, పొదలకూరు మండలం కనుపర్తిలో ఏకగ్రీవమైంద‌న్నారు. 37 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, అల్లూరు మండలం ఇస్కపల్లిలోని రెండు వార్డులకు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదన్నారు. మిగిలిన 35 వార్డులకు 56 మంది నామినేషన్లు దాఖలు చేశారని, అందులో ఒక నామినేషన్‌ తిరస్కరణకు గురైందన్నారు. మొత్తం 35 వార్డులకు గాను 25 వార్డులకు ఒక్క నామినేషనే దాఖలు కావడంతో ఏకగ్రీవం కాగా, మరో నాలుగు వార్డుల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఉపసంహరించుకుని ఒక్కరికే అవకాశం ఇవ్వడంతో అవి కూడా ఏకగ్రీవమ‌య్యాయని, మొత్తం 29 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయని తెలిపారు. వెంకటాచలం మండలంలోని తిరుమలమ్మపాళెం 8వ వార్డు, ఇందుకూరుపేట మండలం లేబూరు 1వ వార్డు, చేజర్ల మండలం మాముడూరు పెరుమాళ్లపాడు 5వ వార్డు, అనంతసాగరం మండలం రేవూరు 4వ వార్డు, పెళ్లకూరు మండలం అర్థమాల 4వ వార్డు, మనుబోలు మండలం వెంకన్నపాళెం గ్రామానికి చెందిన 4వ వార్డులకు ఈ నెల 14న ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement