Thursday, April 25, 2024

తొమ్మిదేళ్లుగా సాగుతున్న నిర్మాణాలు.. వినియోగంలోకి ఎన్న‌డు వచ్చేనో?

ఆత్మకూరు, (ప్రభ న్యూస్‌) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శంకుస్థాపన చేసి ప్రారంభించిన పనులు ఇంకా పూర్తి కాకుండా ఉన్నాయంటే కొంచెం నమ్మడం కష్టమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్న సమయంలో నిర్మాణాలు ప్రారంభిచినా, రాష్ట్ర విభజన జరిగి 8 సంవత్సరాలు పూర్తయినా నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభమైన నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదంటే ఇది ముమ్మాటికి నిజం. ఇది ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో రెవెన్యూ సముదాయ కాంప్లెక్స్‌ నిర్మాణ పరిస్థితి. ఆత్మకూరు మున్సిపాలిటిగా, రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా ఆత్మకూరు మేజర్‌ గ్రామ పంచాయతీని రూపాంతరం చేశారు. మున్సిపల్‌ భవనాన్ని నేతాజీ క్లబ్‌ లోనూ, రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాన్ని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలోనూ ఏర్పాటు చేసి పాలన ప్రారంభించారు. అయితే రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే తలంపుతో అప్పటి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తహసీల్దార్‌ కార్యాలయం, సబ్ ట్రెజరీ, రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాలను మూడింటిని ఒకే చోట నిర్మాణాలు చేపట్టి ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో 2013లో జూన్‌ 25న వీటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రారంభంలో పనులు వేగంగా జరగడంతో రెండేళ్లకే ఈ భవనాలు అందరికీ అందుబాటులోకి వస్తాయని అందరూ భావించారు.

ఆరు నెలలు పనులు వాయువేగంతో సాగాయి. సరిగ్గా ఆ సమయంలోనే 2014 జూన్‌ 2 రాష్ట్ర విభజన జరగడం, అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వ స్థానంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి మొదలు నిర్మాణ పనులు కొంచెం ఆలస్యమవుతూ వచ్చాయి. 2017 వరకు ఎదో అంతంత మాత్రంగా సాగిన పనులు దాదాపు 60 శాతం మేర పూర్తి కూడా అయ్యాయి. సబ్ ట్రెజ‌రీ నిర్మాణం అయితే వినియోగించుకునే దశకు చేరుకుంది. 2017 చివర్లో నిలిచిపోయిన పనులు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఒక్క ఇటుక కూడా పడకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి.

ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికారులు..

ఆత్మకూరును రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా మార్చిన సమయంలో కార్యాలయం కోసం వినియోగించిన ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరం, పక్కనే రెండు రూములతో అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డివిజన్‌ స్థాయి సమావేశాలు నిర్వహించాలన్నా కష్టంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షాకాల సమయంలో ఈ బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయని అంటున్నారు. తహసీల్దార్‌, సబ్ ట్రెజ‌రీ భవనాల గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. మూడు నెలల క్రితం కురిసిన వర్షాలతో అధికారులు పడిన బాధలు అందరినీ అయ్యో అనిపించాయి. పట్టలు కప్పుకుని ప్లాస్టిక్‌ కవర్లలో ఫైళ్లు ఉంచుకుని మరీ పనులు చేయాల్సిన దుస్థితిలోకి వెళ్లిపోయారు. అందరికీ ఉపయోగపడే మాకు ఆపిన నిర్మాణాలు పూర్తి చేసి ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా..

- Advertisement -

అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు మధ్యలో ఉన్న ఈ సగం సగం నిర్మాణాలు అనేక చెడు కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. కొందరు బయటి వ్యక్తులు ఇక్కడకు వచ్చి పొగాకుతో పాటు మద్యం కూడా తాగి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని అధికారులు అంటున్నారు. పగటి సమయంలో తాము కట్టడి చేయగలిగినా.. రాత్రి సమయంలో తామేమి చేయగలమంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రజాప్రతినిధులు ఈ విషయంపై శ్రద్ద చూపి భవన నిర్మాణాల పూర్తికి అవసరమైన నగదు మంజూరు చేయిస్తే నిర్మాణాలు త్వరగా పూర్తయి అధికారులకు, ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement