Thursday, April 25, 2024

న‌వ‌ర‌త్నాల పేరుతో న‌య‌వంచ‌న‌…. చంద్ర‌బాబు

రాపూరు/నెల్లూరు(వేదాయపాళెం) తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో టీడీపీ బలపరిచిన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పనబాక లక్ష్మిని గెలిపించాలంటూ వెంకటగిరి నియోజకవర్గం పరిధిలోని రాపూరు ప్రాంతంలో టీడీపీ జాతీయ అద్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్‌షోకు నలుమూలల నుంచి భారీసంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఉద్ధరిస్తారని నమ్మి ఓట్లేసిన రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచుతున్న జగన్‌ దుష్ట, దుర్మార్గ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయంటూ ధ్వజమెత్తారు. నవరత్నాల పేరుతో.. నయవంచనకు పాల్పడుతున్న జగన్‌రెడ్డీ..ఇచ్చింది గోరంత ..దోచుకుంటున్నది కొండంత అనీ.. నవగ్రహాల చుట్టూ తిరిగినా ..మీ పాపాలకు నిషృతి ఉండదన్నారు. గత టీడీపీ హయాంలో జరిగిన అభివృద్దికి.. ప్రస్తుత వైసీపీ పాలనలో జరుగుతున్న అభివృద్దిపై చర్చించేందుకు సిద్ధమేనా..?అంటూ సవాల్‌ విసిరారు. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తోందన్నారు. కరోనాతో ఆధాయాలు తగ్గి, ఖర్చుల భారం పెరిగినప్పటికీ ..ధరలపెంపుతో ప్రజలపై మరింత భారం మోపుతున్న జగన్‌ పాలనపై ప్రజలు ఈసడించుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలకు .. ఈనెల 14న తిరుపతి సమావేశంలోనైనా జగన్‌ సమాధానం చెబుతారని ఆశించానని, అయితే విషయాన్ని ముందే గ్రహించిన చేతగాని సీఎం కోవిడ్‌ కేసుల వం కతో పారిపోయారన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో పనబాక లక్ష్మి గెలిచినంత మాత్రాన తాను సీఎం కానని, అయితే అభివృద్ధితో ప్రజలు బాగుపడతారన్నదే తన కోరికగా తెలిపారు. కాగా కుల, మత, పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా పారదర్శక విధానాలతో ప్రజా అభివృద్ధి-సంక్షేమ పాలన చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని టీడీపీ తిరుపతి పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి పేర్కొన్నారు.తనను ప్రజలు ఆదరించి గెలిపిస్తే ..అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు రవీంద్ర,గల్లా జయదేవ్‌, నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, టీడీపీ జిల్లా పార్లమెంట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌, వెంకటగిరి, ఉదయగిరి, గూడూరు, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, కంభం విజయరామిరెడ్డి, పాశిం సునీల్‌కుమార్‌, పరసా వెంకట రత్నయ్య,కొమ్మి లక్ష్మయ్యనాయుడు,మాజీ జడ్పీ చైర్మన్‌ పొన్నెబోయిన చెంచలబాబుయాదవ్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య,రాపూరు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement