Friday, March 29, 2024

రైతు ద్రోహి సీఎం జగన్ -మీటర్ల పేరుతో రైతులకు ఉరిః చంద్ర‌బాబు..

ఏపీ కి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారా?
పొదలకూరు బహిరంగ సభలో చంద్రబాబు సూటి ప్రశ్న
పొదలకూరులో చంద్రబాబు భారీ ర్యాలీ

పొదలకూరు, : పొదలకూరు ఎన్నికల ప్రచారసభకు వచ్చిన జన సందోహాన్ని చూస్తుంటే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ విజయాన్ని కోరుతూ పొదలకూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా పొదలకూరు రామ్ నగర్ సెంటర్ నుంచి పంచాయతీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పంచాయతీ బస్టాండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ ను అభివృద్ధి కి చిరునామాగా తయారు చేసేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పథకం ప్రకారం విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాక ముందు ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్ అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుద్దుతున్నాడని విమర్శించారు. రెండేళ్లలో ఏపీ కి జగన్మోహన్ రెడ్డి ఏమి చేశారని ప్రశ్నించారు. 25 మంది ఎంపీ లను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ ఇప్పుడు కేంద్రం వద్ద నడుం వంచారని చెప్పారు. పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ప్రకటిస్తే ఏపీ కి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ పై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు తేలేక పోయారో తిరుపతిలో సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు. ఏపీ కి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం తమ పార్టీ ఎంపీ లు రాజీనామా చేసేందుకు సిద్ధమని, వైసీపీ ఎంపీ లు రాజీనామా కు సిద్ధమా అని సవాల్ విసిరారు. నవ్యాంధ్రప్రదేశ్ కు సంపద సృష్టించే కేంద్రంగా తాను అమరావతి ని తయారు చేస్తే జగన్మోహన్ రెడ్డి అమరావతి ని నాశనం చేసి రాష్ట్రాన్ని ధ్వంసం చేటున్నారని ఆరోపించారు. మద్యపాన నిషేధం విధిస్తామని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన వైసీపీ మద్యం ధరలు మూడు రెట్లు పెంచి దోచుకుంటూ నమ్మకద్రోహం చేశారని విమర్శించారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు స్లాబ్ పద్దతిలో వ్యవసాయానికి విద్యుత్ ఇస్తే, వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తే రాజశేఖర్ రెడ్డి వారసుడిని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి మోటార్లు కు మీటర్లు బిగించి రైతుల మెడకు ఉరితాళ్ళు బిగిస్తున్నాడని రైతులు గమనించాలన్నారు. రైతుల సంక్షేమం కోసం మద్దతు ధర నుంచి, వ్యవసాయ యాంత్రీకరణ, తుంపర్ల సేద్యం వరకు రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తే వాటన్నింటినీ రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి రైతు ద్రోహిగా నిలిచాడని పేర్కొన్నారు. తన హయాంలో ఉద్యోగులకు 43శాతం ఫిట్ మెంట్ ఇచ్చానని, ఇప్పుడు వారికి పీఆర్సీ ఎందుకు ఇవ్వలేదు చెప్పాలన్నారు. 9వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదంటే రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో అర్ధం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. వైజాగ్ లో ప్రభుత్వ ఆస్తులు వేలానికి పెట్టారని, భవిష్యత్ లో ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు కూడా కబ్జా చేస్తారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. టీడీపీ పాలనలో ఎట్టి పరిస్థితుల్లో తాను కరెంట్ చార్జీలు పెంచనని చెప్పానని ఇప్పడు జగన్ విద్యుత్ బిల్లులు పట్టుకుంటేనే షాక్ కొట్టేలా ధరలు పెంచారని తెలిపారు. ఆర్టీసీ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారని మున్సిపాలిటీ ల్లో ఆస్తి పన్ను కూడా పెంచబోతున్నారని వివరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పంచ భూతాలను దోచుకున్నారని, దోచుకున్న డబ్బుతో తిరుపతి ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారని చెప్పారు. జగన్ ధనబలం ఉంటే టీడీపీకి ప్రజాబలం మెండుగా ఉందన్నారు. ప్రజాబలం ముందు ధనబలం బలాదూర్ అన్నారు. తిరుపతిలో టీడీపీ గెలిస్తే తానేమీ సీఎం ను కానని, తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే జగన్ రెడ్డి రోడ్డుపై వస్తారని, ఎమ్మెల్యే లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారని తెలిపారు. టీడీపీ హయాంలో పాలన ఎలా ఉండేది, వైసీపీ పాలన ఎలా ఉందనే విషయాన్ని ప్రజలు బేరీజు వేసుకొని టీడీపీ ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, తిరుపతి ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, టీడీపీ సర్వేపల్లి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement