Tuesday, April 23, 2024

కోటంరెడ్డి ఇచ్చిన షాక్ తో వైసిపి అప్రమత్తం..

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీరియస్‌గా దృష్టిసారించారు. ఇకపై తాను స్వయంగా రంగంలోకి దిగకపోతే జరిగే నష్టాన్ని ఆయన నెల్లూరు జిల్లా ఘటనతో పసిగట్టినట్లు కనిపిస్తోంది. పార్టీకి రాజకీయ సలహాదారుగా ఐప్యాక్‌ టీం ఏర్పాటు చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకూ ఆ సంస్థ ఇచ్చే నివేదికలు అత్యంత గోప్యంగా ఉంచుతూ వచ్చారు. తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిస్థితు లపై సమగ్రంగా అధ్యయనం చేసిన తరువాత సీఎం జగన్‌ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గాల్లో సిట్టింగులు, ఇన్‌ఛార్జిలకు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోనివారిపై ముందుగా ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టాలనుకున్నారు. కానీ, నెల్లూరు ఘటనతో ఈ నిర్ణయాన్ని మార్చుకుని రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ పార్టీ పరిస్థితిని చక్కదిద్దేలా ఒక నిర్ణయానికి వచ్చారు. అదే ఐ ప్యాక్‌ టీం నుండి నియోజకవర్గాల వారీగా అందిన నివేదికలను రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ బాధ్యులకు అప్పగించడమే ఆ నిర్ణయం. ఈమేరకు గురువారం జరిగిన రీజినల్‌ కో ఆర్డినేటర్ల సమావేశంలో సీఎం జగన్‌ ఈ అంశాన్ని వారికి తెలియజేశారు. ఇకపై వీరు వేసే ప్రతి అడుగూ టార్గెట్‌ 2024 అన్నట్లుగా ఉండాలని సీఎం జగన్‌ వారికి హితబోధ చేశారు. అంతేకాకండా శుక్రవారం ఆ నివేదికలను వారికి అందించారు. దీంతో ఇప్పుడు అధికారపార్టీ రాజకీయం రసకందాయంలో పడనుంది.


ఇప్పటి వరకు చేసిన సచివాలయ సమన్వయకర్తల నియామకాలకు సంబంధించి ఐప్యాక్‌ సహా వ్యవస్థాపకుడు రిషి రాజ్‌ సింగ్‌ ఒక ప్రెజెంటేషన్‌ కూడా రీజినల్‌ కో ఆర్డినేటర్లకు ఇచ్చారు. నియోకవర్గాల వారీగా నివేదికలను కూడా అందచేసారు. ఎన్నికల దిశగా అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్న వేళ రీజనల్‌ కో ఆర్డినేటర్లు చురుకుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి నిర్దేశించినట్లు- తెలుస్తోంది. వచ్చే నెలలో ఎమ్మెల్యేలతో మరోసారి గడప గడపకు ప్రభుత్వం నిర్వహణపైవర్క్‌ షాప్‌ ఏర్పాటు- చేయనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే పని తీరుపైసర్వే నివేదికల ఆధారంగా హెచ్చరికలు చేసి ఉండటంతో వారి పని తీరుపై ఆసమావేశంలో తాజా రిపోర్టులను వెల్లడించనున్నారు. అదే సమయంలో కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.

స్థానిక పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహన :
ముఖ్యమంత్రి తీసుకున్న తాజా నిర్ణయంతో రీజినల్‌ కో ఆర్డినేటర్లు, జిల్లా బాధ్యులకు వారి పరిధిలోని జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాలపై పూర్తిస్థాయిలో పట్టు వస్తుంది. అంతేకాకుండా ఎవరు ఏ విధంగా ఉంటూ వస్తున్నారు.. సిట్టింగ్‌పై వ్యతిరేకత ఉంటే ఎందుకు ఉంది..ఎవరి రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది..వారు పార్టీకి నిస్వార్ధంగా పనిచేస్తున్నారా..లేదా..ఏ ప్రయోనాలు ఆశించి సిట్టింగులతో మంచిగా లేదా.. వ్యతిరేకంగా ఉంటున్నారు..తదితర అంశాలపై రీజినల్‌ కో ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ బాధ్యులకు పూర్తిస్థాయి అవగాహన రానుంది. ఇప్పటివరకూ అక్కడ సమావేశాల సందర్భంగా నంబరు ఇచ్చి ఫోన్‌ చేయమనడంతో ఎవరు ఏదిచెబితే అదే నిజమనుకునే పరిస్థితి నుండి పరిస్థితి మారింది. దీంతో రీజనల్‌ కో ఆర్డినేటర్లు కొంతమేర ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇకపై నియోజకవర్గంలో ట్రబుల్‌ షూటర్లుగా వీరే మారనున్నారు.
నియోజకవర్గ సమన్వయకర్తలూ కీలకమే :
ఇకపై నియోజకవర్గ సమన్వయకర్తలుగా నియమితులైన వారు కూడా కీలకంగా మారనున్నారు. వారి పరిధిలో ఆయా నియోజకవర్గాల నుండి కొంతమేర సమాచారాన్ని పార్టీ అధిష్టానం ప్రతి మూడు రోజులకు ఒక సారి చొప్పున సేకరించాలని యోచిస్తోంది. వారంలో రెండు సార్లు ఇలా పరిస్థితులపై సమీక్షిస్తే అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వచ్చన్నది పార్టీ అధిష్టానం యోచనగా తెలుస్తోంది. దీనికితోడు జగనన్నకుచెబుదాం కార్యక్రమం అమలు చేయబోతున్నామని, దీనిపై నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలోనూ దీనిపై అవగాహన కల్పించేలా చూడాలన్నది ఇప్పుడు పార్టీ అధిష్టాన యోచనగా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు సమన్వయకర్తల బాధ్యత నియోజకవర్గాల్లో కీలకం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement