Tuesday, April 16, 2024

Navaratnas – జ‌గ‌న్ కు సంక్షేమ ర‌క్ష‌…

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో మరో పది నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. గత ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని గడచిన నాలుగేళ్లలో 98 శాతం పైగా ఆచరణలో అమలుచేసి చూపించారు. ఈనేపథ్యం లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలతోపాటు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జగన్‌ పథకా లపై విస్తృతస్థాయిలో చర్చ మొదలైంది. ఇచ్చిన మాట ప్రకారం పేద ప్రజలకోసం నవరత్నాలను అందిస్తూ ప్రతి పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కిరికీ ఫలాలను అందిస్తూ మాట తప్పను .. మడమ తిప్పను అన్న మాటను సార్థకం చేసుకుంటూ సీఎం జగన్‌ అడుగులు వేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పేదలకోసం ఆయన అమలు జరుపుతున్న సంక్షేమ పథకాలే జగన్‌కు రక్షణ కవచంలా నిలవబోతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఇదే అంశంపై చర్చ జరుగుతుంది. పల్లెల్లో రచ్చబండపైన, పట్టణ ప్రాంతాల్లో హోటళ్లు, పార్కుల్లో ఇలా నలుగురు కలిసి కూర్చొన్న ప్రతి సందర్భంలోనూ జగన్‌ పథకాలపైనే ప్రస్తావన సాగుతుంది. ఇచ్చిన మాట ప్రకారం లోటు బడ్జెట్‌ను లెక్క చేయకుండా అన్ని పథకాలను నూటికి నూరు శాతం అమలు చేస్తూ ముందుకు సాగుతున్న జగన్‌ నాయకత్వాన్ని మెజార్టీ ప్రజలు తిరిగి మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టంగా అర్ధమౌతుంది.

2019 మే 30వ తేదీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం జగన్‌ పెన్షన్‌పై తొలి సంతకం చేశారు. అనంతరం నవరత్నాలకు సంబంధించి ఫైలుపై సంతకాలు చేశారు. ఇలా ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలను దశలవారీగా అన్ని వర్గాల ప్రజలకు అందిస్తూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకుంటూ వస్తున్నారు. ఈనేపథ్యంలోనే సంక్షేమ పథకాలపై గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో చర్చ మొదలైంది. సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకునే నేతలు ఆయా సందర్భాల్లో సంక్షేమ పథకాల గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తుంటారు. అయితే, రాష్ట్రంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జగన్‌ పథకాలపై ప్రజలే చర్చించుకోవడం చూస్తుంటే గడచిన నాలుగేళ్లలో వైసీపీకి మరింత ఆదరణ పెరిగిందని స్పష్టమౌతుంది. రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

వెనుకబడిన వర్గాల్లో .. కొత్త వెలుగులు
రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలను ఆర్ధికంగా ముందుకు నడిపించాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గడచిన నాలుగేళ్లుగా పేద ప్రజల కోసం ఆర్ధిక పరమైన పథకాలను క్రమం తప్పకుండా అమలు చేస్తూ వస్తున్నారు. ప్రతి ఇంటికీ ఏదో ఒక పథకం ద్వారా లబ్ది చేకూర్చుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రాంతాల పేద ప్రజల్లోనూ ఆర్ధిక పరంగా కొంత మార్పు కనిపిస్తుంది. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయా వర్గాలకు చెందిన ప్రజలే బహిరంగంగా ప్రకటిస్తూ వస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే కొన్ని కుటుంబాలు ఆర్ధికంగా బలపడటంతోపాటు వారి జీవితాల్లో కొత్త వెలుగులు కూడా కనిపిస్తున్నాయి. అందుకోసం సీఎం జగన్‌ ఐదేళ్ల ప్రణాళికను రూపొందించుకున్నారు. అయితే నాలుగేళ్లలోపే తాను చేపడతానన్న అన్ని పనులను దాదాపుగా పూర్తిచేసి తానేంటో చాటిచెప్పారు. గతంలో అనేక ప్రభుత్వాలు వెనుకబడిన ప్రజలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడమే తప్ప అధికారంలోకి వచ్చాక వారికోసం కొత్తగా తెరపైకి తెచ్చిన పథకాలు చాలా తక్కువ. అవికూడా అరాకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకునేవారు. సీఎం జగన్‌ మాత్రం ఆర్ధికపరమైన ఇబ్బందులు రాష్ట్రాన్ని వెంటాడుతున్నా లెక్క చేయకుండా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ వస్తున్నారు.

పాలనతోపాటు .. పార్టీపైన పూర్తిస్థాయి పట్టు సాధించిన సీఎం జగన్‌
అతి చిన్న వయస్సులోనే ముఖ్యమంత్రిగా అతి తక్కువ వయస్సులోనే ప్రాంతీయ పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చిన రికార్డు సాధించిన జగన్‌ 2024 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలు వైసీపీని ఓడించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా మరోవైపు తిరిగి అధికారాన్ని సొంతం చేసుకోవాలని జగన్‌ వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగానే గడచిన మూడేళ్లుగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన గడచిన ఏడాది కాలంగా పార్టీ పరమైన కార్యకలాపాలపైన ఫోకస్‌ పెంచారు. ఎప్పటికప్పుడు 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిల పనితీరుపై సర్వే నివేదికలు తెప్పించుకుంటూ వారి మైలేజీ మరింత పెరిగేలా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకే సందర్భంలో ఇటు పాలనపైన అటు పార్టీపైన పట్టు సాధించేలా నిర్ణయాలు తీసుకోవడమంటే ఆషా మాషీ విషయం కాదు. సీఎం జగన్‌ మాత్రం ప్రజల సంక్షేమమే సంకల్పంగా ముందుకు సాగుతూ తనను నమ్ముకున్నప్రతి ఒక్కరికి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు అప్పగిస్తూ అందరినీ సంతృప్తి పర్చేలా నిర్ణయం తీసుకుంటున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో 2019 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం వైసీపీకి మరింత మైలేజీ ఆదరణ పెరిగింది. ఇదే విషయాన్ని గ్రామీణ ప్రజలు ఆయా ప్రాంతాల్లో నిత్యం చర్చించుకుంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement