Friday, April 19, 2024

విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యం, ఉన్నత విద్యలో కర్నూలుకు ప్రత్యేక స్థానం.. ముగ్గురికి గౌరవ డాక్టరేట్లు

ప్రభన్యూస్‌: ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే అది కేవలం విద్యతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర గవర్నర్‌ యూనివర్సిటీ కులపతి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. శనివారం కర్నూలు నగరంలోని రాయలసీమ విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవం యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఆనంద్‌ రావు అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వర్చువల్‌ విధానంలో కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ మాట్లాడుతూ ఏ దేశమైన అభివృద్ధి అనేది విద్య అభివృద్ధిపైనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది అని తెలిపారు. దేశానికి సామాజిక ఆర్థిక రాజకీయ సాంకేతిక పురోగతిని తీసుకురావడానికి ఉన్నత విద్య ఒక ముఖ్యమైన సాధనంగా పరిగణించబడుతుంది. ప్రతి విద్యార్థి యొక్క విశిష్ట సామర్థ్యాలను బయటికి తీసుకురావడమే నూతన జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యమని తెలిపారు. వృత్తి విద్యతో సహా ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తిని 26.3 శాతం నుండి 50 శాతానికి పెంచడంగా నూతన విద్యా విధానం లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.

రాయలసీమ ముఖద్వారం అయినా కర్నూలు ఒక చరిత్ర సంస్కృతి గొప్ప వారసత్వం కలిగి ఉందన్నారు. యూనివర్సిటీ 2 ఎఫ్‌,12 బి హోదాలు పొందడం హర్షణీయమన్నారు. యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్లర్‌ ఆనందరావు మాట్లాడుతూ మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడేందుకు రాయలసీమ విశ్వవిద్యాలయం నిరంతరం కృషి చేస్తుందన్నారు. 2030నాటికి భారతదేశం ప్రపంచంలోనే అత్యంత యువ దేశాలలో ఒకటి ఉంటుందన్నారు. వెనుకబడిన ప్రాంతంలో యువతీ యువకులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావాలని రాయలసీమ యూనివర్సిటీ నెలకొల్పబడింది అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్లర్‌ ప్రొఫెసర్‌ జగదీశ్వర రావు మాట్లాడుతూ 2030 నాటికి సమిష్టి సమానమైన నాణ్యమైన విద్యను నిర్ధారించడం అందరికీ జీవితకాల అభ్యాస అవకాశాలను ప్రోత్సహించడం నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాటి బండ్ల ఆనంద్‌ రావు , ఇనాక్‌, దస్తగిరి రెడ్డి లకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. 66 మంది విద్యార్థులకు గోల్డ్‌ మెడల్‌ 241 మంది పీహెచ్డీ విద్యార్థులకు 1267 మంది పీజీ విద్యార్థులకు 15,339 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఉర్దూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ర్‌ ఆచార్య శ్రీనివాసులు, వివిధ యూనివర్సిటీ ఉపకులపతులు రిజిస్ట్రార్ర్‌ లు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు , యూనివర్సిటీ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement