Friday, April 19, 2024

Nara Lokesh: మూర్ఖుడు ముఖ్యమంత్రి అయితే వ్యవస్థలన్నీ విధ్వంసం

గుంటూరు జిల్లా నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్ బాబుపై జరిగిన దాడిని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. మూర్ఖుడు ముఖ్యమంత్రి అయితే వ్యవస్థలన్నిటిని విధ్వంసం చేస్తాడనడానికి.. నరసరావుపేటలో జరిగిన ఘటన ఉదాహరణ అని ఆయన అన్నారు. సంబంధం లేని విషయంలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ అరవింద్ బాబుపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సరికాదని పేర్కొన్నారు. అరవింద్ బాబును అరెస్ట్ చేయడమే కాకుండా.. ఆయనను తరలిస్తున్న అంబులెన్స్‌పై వైఎస్సార్సీపీ రౌడీ మూకలు దాడి చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆరోపించారు. పోలీసుల ఏకపక్ష ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు. పోలీసు శాఖకి ఉన్న గౌరవాన్ని గంగలో కలిపేసే విధంగా కొంతమంది పోలీసు అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేసి వారిని విడుదల చెయాలని డిమాండ్ చేశారు. అరవింద్ బాబుపై దాడికి పాల్పడిన వైసిపి రౌడీలను అరెస్ట్ చేసి శిక్షించాలి లోకేశ్ డిమాండ్ చేశారు.

కాగా, గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిన్న ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతల ఆందోళనలతో నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్ బాబు గుండెలపై బూటుకాలుతో తన్నినట్లు ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీంతో ఆయన సృహ తప్పి పడిపోయారు. వెంటనే అరవింద్ బాబును నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement