Wednesday, November 29, 2023

Big Story: చర్రితలో సరికొత్త అధ్యాయం.. నంద్యాల జిల్లాగా సర్వం సిద్ధం

నంద్యాల జిల్లాగా ప్రారంభం కాబోతోంది. ఇది ఏపీ చర్రితలోనే సరికొత్త అధ్యాయంగా మారనుంది. ప్రజలకు, ప్రభుత్వాన్ని మరింత దగ్గరకు చేసేందుకు అమలు చేస్తున్న పరిపాలనా సంస్కరణల్లో భాగంగా..కొత్త జిల్లాల ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసిన సంగతి విదితమే. ఈ నెల 4వ తేదీ ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్య రాష్ట్రంలో కొత్త జిల్లాలకు అంకురార్పణ జరగనుండగా, ఇందులో నంద్యాల జిల్లా అవతరణ ఒకటీ. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం గత జనవరి 26న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. అప్పటి నుంచి నంద్యాల జిల్లా ఏర్పాటులో అధికారులు తలమునకలయ్యారు. కలెక్టర్ కార్యాలయం గుర్తింపు వద్ద నుంచి కొత్త రెవిన్యూ, ఇతర  కార్యాలయాల గుర్తింపు వరకు గత మూడు నెలలుగా కసరత్తు చేసి భవనాలను గుర్తించారు. దీంతో నంద్యాల కొత్త జిల్లాతోపాటు కొత్త రెవెన్యూ డివిజన్లు కూడా ఈ నెల 4వ తేదీన అమలులోకి రాబోతున్నాయి.

వాస్తవంగా జిల్లా ఏర్పాట్ల క్రమంలో ప్రభుత్వం మొదట జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ లో కర్నూలు జిల్లాలో ఎన్ని మండలాలు, నంద్యాలలో 28 మండలాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించడం జరిగింది. అయితే మొదటి నుంచి నంద్యాల లో ఉన్న గడివేముల, పాణ్యం మండలాలను కర్నూల్లో కలవడంపై భారీగా అభ్యంతరాలు వచ్చాయి. నిరసనలు, వినతులు పెద్ద ఎత్తున ప్రభుత్వంకు చేరాయి. దీంతో వీటిపై పరిశీలించిన ప్రభుత్వం వారం క్రితం పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాల కలుపుతూ తాజాగా నిర్వహించిన క్యాబినెట్ లో ఖరారు చేశారు. తిరిగి గెజిట్ నోట్ లో ప్రకటించారు. వీటి ప్రకారం రెవిన్యూ పరంగా కర్నూలు అర్బన్ తో కలిపి కర్నూలు జిల్లాలో 26 మండలాలు ఉండగా, నంద్యాలలో 29 మండలాలు చేరనున్నాయి. వీటితో పాటు కొత్తగా రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుకు ఆమోదం ఇప్పటికే లభించింది.

- Advertisement -
   

రెవెన్యూ డివిజన్లు ఇవే ;

నంద్యాల నూతన జిల్లాగా అవతరించిన క్రమంలో.. జిల్లాలో రెవెన్యూ డివిజన్లు కూడా కొత్తగా రానున్నాయి. వీటిలో నంద్యాలలో 3, కర్నూల్ లో మూడు రెవెన్యూ డివిజన్లు రానున్నాయి. ప్రస్తుతం నంద్యాల పరిధిలోని ఆత్మకూరు, డోన్ లను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పడనున్నాయి. ఇంకా కర్నూలు జిల్లా పరిధిలో పత్తికొండ ను రెవెన్యూ డివిజన్ గా మంత్రిమండలి గుర్తించింది. దీంతో నూతనంగా తొమ్మిది మండలాలతో పత్తికొండ రెవెన్యూ డివిజన్ గా అవతరించ నుంది. ఇక ఆత్మకూరు, డోన్,  డివిజన్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆయా కేంద్రాలలో ఉండే తహసీల్దార్‌ కార్యాలయాలను ప్రస్తుతం రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాలుగా మారుస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం స్థానంలో రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంగా పేరు మార్పు చేశారు.

 కర్నూలు జిల్లాగా వివరాలు ఇవే

నూతన జిల్లాగా నంద్యాల అవతరించనున్న క్రమంలో  ప్రస్తుతం కర్నూలు జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 26 మండలాలకు పరిమితం కానుంది. ఇందులో కర్నూలు పరిధిలో కల్లూరు, ఓర్వకల్లు, సి.బెళగల్‌, గూడూరు, కర్నూలు అర్బన్‌, కర్నూలు గ్రామీణం, కోడుమూరు, వెల్దుర్తి. 8 మండలాలు ఉండగా, ఆదోని, మంత్రాలయం, పెద్దకడుబూరు, కోసిగి, కౌతాళం, హోళగుంద, ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల 9 మండలాలు ఆదోని డివిజన్ పరిధిలో ఉండనున్నాయి. ఇక పత్తికొండ రెవిన్యూ డివిజన్ పరిధిలో హాలహర్వి, ఆలూరు, ఆస్పరి, దేవనకొండ, చిప్పగిరి, పత్తికొండ, మద్దికెర (ఈస్ట్‌), తుగ్గలి, కృష్ణగిరి 9 మండలాలు ఉండనున్నాయి.

 నంద్యాల జిల్లా పరిధిలో 29 మండలాలు

ఇక నూతనంగా ఆవిర్భవించిన నంద్యాల జిల్లా పరిధిలో 3 రెవెన్యూ డివిజన్లు, మొత్తం 29 మండలాలు ఉండనున్నాయి.వీటిలో ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 10 మండలాలను గుర్తించారు. ఇందులో శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, కొత్తపల్లి, పాములపాడు, మిడ్తూరు, బండిఆత్మకూరు మండలాలు ఉండనున్నాయి. ఇక నంద్యాల రెవిన్యూ డివిజన్ పరిధిలో మొత్తం13 మండలాలను గుర్తించడం వీటిలో నంద్యాల, గోస్పాడు, శిరివెళ్ల, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి, రుద్రవరం, మహానంది, ఆళ్లగడ్డ, పాణ్యం, గడివేముల, సంజామల, కొలిమిగుండ్ల మండలాలు ఉన్నాయి.

ఇక డోన్‌ రెవిన్యూ డివిజన్ పరిధిలో ఆరు మండలాల్లో గుర్తించగా, వీటిలో బనగానపల్లి, అవుకు, కోవెలకుంట్ల, డోన్‌, బేతంచెర్ల, ప్యాపిలి మండలాలు ఉన్నాయి. మొత్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి సవ్యంగా సాగేలా ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు చేపడుతోంది. ఈ రోజు నుంచి రాబోయే మూడు రోజులు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. నాలుగో తేదీ వరకు ఉన్నతాధికారులు అందరూ అందుబాటులో ఉండాలని, ఎవరూ సెలవులు పెట్టవద్దంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌ శర్మ మెమో జారీ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సీఎస్‌ ఉన్నతాధికారులకు పలు సూచనలు చేయనున్నారు. అదేవిధంగా జిల్లాలు ఆరంభం రోజైన నాలుగో తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. అధికారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement