Friday, April 19, 2024

Breaking: ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించిన ఎమ్మెల్సీ అశోక్ బాబు

టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం అనుమతించింది. ఈరోజు మధ్యాహ్నం 2:15 గంటలకు పిటిషన్‌పై విచారణకు హైకోర్టు అనుమతించింది. గురువారం రాత్రి ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. పదోన్నతి కోసం నకిలీ విద్యార్హతలను చూపించారన్న ఆరోపణలపై ఆయనను గురువారం రాత్రి పొద్దుపోయాక విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. ఒక వేడుకకు హాజరై పటమటలంకలోని తన నివాసానికి చేరుకున్న వెంటనే సీఐడీ అధికారులు ఆయనను తమతో తీసుకెళ్లిపోయారు. అశోక్‌బాబు వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా పని చేసి రిటైర్‌ అయ్యారు.

అయితే… డిగ్రీ చదవకుండానే చదివినట్లుగా చూపించారని ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉమ్మడి రాష్ట్రంలోనే శాఖాపరమైన విచారణ జరిగింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని అశోక్‌బాబు అప్పట్లో వివరణ ఇచ్చారు. దీనిపై విజిలెన్స్‌ అధికారులు కూడా విచారణ జరిపి… ఆయనపై అభియోగాలను ఉపసంహరించారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలోనే ఈ కేసు ‘క్లోజ్‌’ అయ్యింది. అశోక్ బాబు ఏపీ ఎన్జీవో నేతగా, సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో జేఏసీ అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. తాజాగా… పీఆర్సీపై రగడ రగులుతున్న సమయంలోనే అశోక్‌బాబుపై వైసీపీ ప్రభుత్వం మరోమారు పాత ఆరోపణలను బయటికి తీసింది. తమకు అందిన ఫిర్యాదు మేరకు… విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐడీకి లోకాయుక్త సూచించింది. దీంతో సీఐడీ వెంటనే కేసు నమోదు చేయడం జరిగిపోయింది. గురువారం రాత్రి ఆయనను అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే… ప్రభుత్వ వ్యూహంలో భాగంగానే తనపై లోకాయుక్తకు కొత్తగా ఫిర్యాదు చేయించినట్లు అశోక్‌బాబు ఆరోపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement