Friday, March 29, 2024

ఏపీ టీడీపీకి షాక్… గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా..?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీని వీడనున్నట్లు సమాచారం. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. కొంత కాలంగా పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం టీడీపీలో ఉన్న సీనియర్ నేతల్లో బుచ్చయ్య చౌదరి ఒకరు. పార్టీ ఆవిర్భావం నుంచి చాలా మంది నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లినా.. ఆయన మాత్రం టీడీపీని వీడలేదు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. పార్టీలో సీనియర్ అయిన తనను కాదని, తన కంటే జూనియర్లకు మంత్రి పదవి ఇవ్వడంతో అప్పట్లో తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఘోరంగా ఓడినా.. ఆయన మాత్రం రాజమండ్రి రూరల్ నుంచి విజయం సాధించారు. అప్పటి నుంచి పార్టీ తరపున వైసీపీ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. అయితే, పార్టీలో తనకు సరైన గుర్తింపు లేకపోవడమే కాకుండా.. పార్టీ కమిటీలు, ఇతర నిర్ణయాలపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ వీడనునట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ లకు కూడా ఆయన స్పందించడం లేదని సమాచారం.

కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడమే కాకుండా కేవలం 23 సీట్లకే పరిమితమైంది. వారిలో ఇప్పటికే నలుగు టీడీపీని కాదని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. ఇక, గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా వైసీపీకి మద్దతు ప్రకటిస్తారా? లేక రాజకీయాలకు దూరంగా ఉంటారా ? అన్నది ఉత్కంఠగా మారింది.

ఇది కూడా చదవండిః ఏపీ సీఎం జగన్‌కు షాక్.. సమన్లు జారీ చేసిన సీబీఐ కోర్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement