Saturday, April 20, 2024

చెరువుల్లో ప్రగతి కింద మిషన్‌ అమృత్‌ సరోవర్‌.. ఆగస్టు 15 నాటికి ఎంపిక పూర్తి చేయాలని లక్ష్యం

రాయలసీమ, ప్రభన్యూస్‌ : చెరువుల అభివృద్ధికి కేంద్రం శ్రీకారం చుట్టింది. రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో 500 చెరువులను మిషన్‌ అమృత్‌ సరోవర్‌ పథకం కింద ఎంపిక చేశారు. ఆయా చెరువుల ప్రగతికి ఉపాధి హామీ పథకం నిధులు వెచ్చించనున్నారు. పనులు పూర్తిచేసి వచ్చే ఆగస్టు 15న చెరువు కట్టలపై జాతీయ జెండా ఎగురవేయాలని నిర్ణయించారు.

ఒక్కొక్క చెరువుకు రూ. 10 లక్షలు..

మిషన్‌ అమృత్‌ సరోవర్‌ పథకం కింద ఎంపికైన చెరువుల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు చేపడతారు. 10 వేల క్యూబిక్‌ మీటర్ల మేర నీటిని నిల్వ చేసేలా కొలతలు తీసుకుని ఒండ్రుమట్టిని తీస్తారు. ఆ మట్టిని పొలాలకు తరలించేందుకు, కట్ట పటిష్టానికి ఉపయోగించనున్నారు. కట్టపై పెరిగిన ముళ్ల పొదలు తొలగిస్తారు. ఒక్కొక్క చెరువుకు రూ. 10 లక్షలతో పాటు అవసరమైతే 15వ ఆర్ధిక సంఘం నిధులు వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు.

ప్రత్యేక యాప్‌తో పర్యవేక్షణ..

పనులు నిర్వహణను గ్రామ పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. పురోగతిని నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ విధానం ద్వారా ఎప్పటికప్పుడు కేంద్ర సరోవర్‌కు పంపిస్తారు. ఇందుకు ఏరియా ఆఫీసర్‌ యాప్‌ రూపొందించారు. దాతలు, ప్రజలనుంచి స్పందన వస్తే అనుమతించనున్నారు. పనులు పూర్తయ్యాక చెరువు కట్టపై ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేయాలనే ఆదేశాలు జారీ అయ్యాయి.

- Advertisement -

ఉపాధి పని దినాలే లక్ష్యం..

రాయలసీమ ఉమ్మడి జిల్లాలో ఉపాధి హామీలో ప్రస్తుతం మొత్తం 17.75 లక్షల జాబ్‌ కార్డులుండగా దాదాపు 6 లక్షలు పైగా పనులకు హాజరవుతున్నారు. మిషన్‌ అమృత్‌ సరోవర్‌ పథకం కింద పని కల్పించి కూలీల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. ప్రతి చెరువుకింద లక్ష పని దినాలు కల్పించాలన్నదే లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో కనీస వేతనం 150 నుంచి 200 వరకు వేతనం అందుతుండటంతో కూలీలు వాపోతున్నారు. ఈ పథకం ద్వారా పని దినాలు పెంచి వేతనం పెంచడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో 17.75 లక్షల జాబ్‌ కార్డులున్నాయి. అనంతపురం జిల్లాకు సంబంధించి 2,66,669 జాబ్‌ కార్డులుండగా, 4,97,615 మంది ఉపాధి కూలీలున్నారు. సత్యసాయి జిల్లాలో 2,32,056 మంది జాబ్‌ కార్డులుండగా 4,30,086 మంది ఉపాధి కూలీలున్నారు. చిత్తూరు జిల్లాలో 1,98,962 జాబ్‌ కార్డులుండగా 3,41,245 మంది ఉపాధి కూలీలున్నారు. తిరుపతి జిల్లాలో 2,26,409 జాబ్‌ కార్డులుండగా 3,74,028 మంది ఉపాధి కూలీలున్నారు. కడప జిల్లాకు సంబంధించి 1,96,946 జాబ్‌ కార్డులుండగా 3,44,029 మంది ఉపాధి కూలీలున్నారు. అన్నమయ్య జల్లాకు సంబంధించి 1,91,775 జాబ్‌ కార్డులుండగా 3,18,604 మంది ఉపాధి కూలీలున్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించి 2,40,941 మంది జాబ్‌ కార్డులుండగా 4,75,608 మంది ఉపాధి కూలీలున్నారు. సీమ జిల్లాల్లో 17,77141 జాబ్‌ కార్డులుండగా 31,30,736 మంది ఉపాధి కూలీలున్నారు. చెరువుల రూపురేఖలు మార్చేందుకు శుభ్రతా పనులతో పాటు చెత్తా చెదారం, పిచ్చిమొక్కలు తొలగిస్తారు. కట్ట పటిష్టతకు చర్యలు తీసుకోవడంతో పాటు పచ్చదనం పెంచే చర్యలు చేపడతారు. ప్రహరీ నిర్మించి నీటి వనరులు పెంచి రక్షణకు చొరవ చూపుతారు. వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించనున్నారు. ప్రధానంగా పర్యాటకంగా తీర్చి దిద్దనున్నారు. చాలాకాలం వీటి సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక, పురపాలక సంఘాల్లో దాదాపు 202 చెరువులు ట్యాంకులు, సరస్సులలో 4234.62 ఎకరాల విస్తీర్ణంలో రూ. 360 కోట్లు దాకా నిధులు వ్యయం చేయనున్నారు. సరోవరం పథకం ద్వారా చెరువుల రూపురేఖలు మారడంతో పాటు ఉపాధి పని దినాలు పెరగనున్నాయి. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసి క్షేత్రస్థాయిలో వేగంగా పనులు ప్రారంభించడానికి శ్రీకారం చుట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement