Thursday, March 28, 2024

కేంద్రం ఇచ్చిన కోవిడ్ గైడ్ లైన్స్ మార్చగలరా?: సోముకు వెల్లంపల్లి ప్రశ్న

ఏపీ సీఎం వైఎస్ జగన్ హిందూ వ్యతిరేకి కావడం వల్లే హిందువులు అత్యంత పవిత్రంగా భావించే వినాయక చవితి వేడుకలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.  

పండుగలకు కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా హిందువులకు వ్యతిరేకమా ? అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన కోవిడ్ నిబంధనలను సోము వీర్రాజు మార్చగలరా? అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభించాలని కోరుకుంటున్నారా ? మండిపడ్డారు.

వినాయక చవితి చేసుకోవద్దన్నారంటూ బీజేపీ నేతలు ఆందోళన పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కుల, మత రాజకీయాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. వినాయక చవితి చేసుకోకూడదని ప్రభుత్వం ఎక్కడైనా చెప్పిందా? నిలదీశారు. ప్రభుత్వం తరఫున ఎవరైనా చెప్పారా..? పెద్దఎత్తున వేడుకలు జరగకుండా, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. కేంద్ర హోం శాఖ ఆగస్టు 28న ఇచ్చిన గైడ్ లైన్సును అనుసరించి పండుగ జరుపుకోవాలనే చెప్పామని వివరించారు.

వినాయక చవితి అందరి పండుగ అన్న మంత్రి.. ఇళ్ళల్లో, దేవాలయాల్లోనూ చేసుకోవచ్చన్నారు. పెద్ద పెద్ద విగ్రహాలు వీధుల్లో పెట్టి, ఊరేగింపులు, భారీ ఎత్తున వేలు, లక్షల మందితో ఊరేగింపులు, హంగామాలు, ఆర్భాటాలు చేయడం వద్దని మాత్రమే ప్రభుత్వం చెప్పిందని తెలిపారు.  పక్కనున్న బీజేపీ పాలిత కర్ణాటక ప్రభుత్వం కూడా 20 మందితో పండుగ చేసుకోవలని ఆదేశించినట్లు చెప్పారు. అక్కడ కూడా ఊరేగింపులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు.  

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. బీజేపీకి ఈ రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ లేరని ఎద్దేవా చేశారు. ఎంతసేపటికీ మతం ముసుగులో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీకి ఓట్లు వేయలేదన్న కక్ష ఆపార్టీలో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభించాలని మీరు కోరుకుంటున్నారా? అని సోము వీర్రాజుని ప్రశ్నించారు. గారూ..? కోవిడ్ వల్ల ఇప్పటికీ ఎంతో మంది తమ కుటుంబాలను కోల్పోతున్నారన్న మంత్రి… ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి.. పండుగ పేరుతో మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఏమిటి? ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందూ మతం మీద ప్రేమ, గౌరవం బీజేపీకి ఉంటే.. చంద్రబాబు హయాంలో విజయవాడలో 50 పురాతన దేవాలయాలు కూల్చివేసినప్పుడు.. గోదావరి పుష్కరాల్లో  30 మంది అమాయక భక్తుల్ని పొట్టనపెట్టుకున్నప్పుడు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు..? నిలదీశారు.. చంద్రబాబు  చేసింది తప్పు అని ఏనాడూ బీజేపీ ఎందుకు చెప్పలేదు.? ప్రశ్నించారు. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల సమయంలోనూ బీజేపీ నేతలు మతాన్ని, కులాన్ని రెచ్చగొట్టి, హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేయాలని కుట్రలు పన్నితే.. ఆపార్టీకి డిపాజిట్లు రాకుండా ప్రజలు ఓడించారని గుర్తుచేశారు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖను మార్చే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా? అడిగారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాసి ఉందన్న మంత్రి వెల్లంపల్లి.. ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంశాఖ జారీ చేసిన కరోనా గైడ్ లెన్స్ ను మార్పించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement