Wednesday, April 24, 2024

కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి

కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్థంగా ఉండాలని ఏపీ రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ ఆదేశించారు. శనివారం అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శంకర నారాయణ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కరోనా ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని తనిఖీ చేశామన్నారు. జనరల్ ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలు మెరుగుపరచాలని, ఓమిక్రాన్ కేసులు పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా కోవిడ్ బారిన పడిన వారికి తక్షణమే వైద్య సౌకర్యాలు అందించేందుకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.

కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. కరోనా నివారణ కోసం దేశంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకోనటువంటి ముందు జాగ్రత్త చర్యలు సీఎం జగన్ తీసుకున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ఓమిక్రాన్ కేసులు పెరిగే అవకాశం ఉందన్న మంత్రి.. వాటిని ఎదుర్కొనేందుకు ఆస్పత్రిలో అవసరమైన సౌకర్యాలు, సదుపాయాల ఏర్పాటు చేస్తామన్నారు. డాక్టర్లు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఆస్పత్రిలో 100 ఐసియు బెడ్ లు, 600 వరకు ఆక్సిజన్ బెడ్లు, 100 కామన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పేషెంట్లకు అవసరమైన చికిత్స, ఆక్సిజన్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అనంతపురం నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, క్యాన్సర్ ఆస్పత్రిలో అత్యవసర సేవలు అందించేందుకు ఆక్సిజన్ బెడ్లు, ఐసియు బెడ్ లను సిద్ధం చేస్తున్నామన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోనే కాకుండా ఏరియా ఆస్పత్రులలో, పీహెచ్సీలలో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement