Wednesday, April 24, 2024

జగన్ బంధువులమైన మేమే మతం మారాలి కదా?: మంత్రి బాలినేని

ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మత మార్పిడిలపై బీజేపీ నేతలు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఒకవేళ మత మార్పిడిలు చేయాలంటే జగన్ బంధువులమైన తామే ముందు మతం మారాలి కదా అని ప్రశ్నించారు. తామంతా హిందువలమేనని.. బీజేపీ ఆరోపణల్ని ప్రజలు పట్టించుకోరన్నారు. దేశంలో ఎవరు ఇష్టం వచ్చిన మతాన్ని వారు అనుసరించవచ్చన్నారు. కుల, మతాలకు తీతంగా వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని.. ఫాదర్‌లు, మౌజమ్‌లతో పాటు పూజారులకు ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోందని మంత్రి బాలినేని గుర్తు చేశారు.

సీఎం జగన్‌ తిరుపతితో సహా అన్ని దేవాలయాలకు వెళతారని.. అన్ని మతాలను సమానంగా చూస్తారన్నారు. సోము వీర్రాజు వ్యాఖ్యలు రాజకీయ లబ్ది కోసమేనని.. బలవంతంగా ఎవరూ మత మార్పిడిలు చేయరని చెప్పారు. 2014 ఎన్నికలకు ముందు కూడా ఇలాగే మతం అంశాన్ని ముందుకు తెచ్చారని.. ప్రజలు విశ్వసించలేదన్నారు. బీజేపీ పద్ధతిని మార్చుకోవాలని మంత్రి హితవు పలికారు. కొవిడ్ ప్రభావంతో అన్ని రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులు క్షీణించాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి తెలిసి కూడా సోము వీర్రాజు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గత టీడీపీ ప్రభుత్వం అప్పులు చేస్తే.. వీర్రాజు ఎందుకు మాట్లాడలేదని మంత్రి ప్రశ్నించారు. జలాల విషయంలో చంద్రబాబు చేస్తున్న రాజకీయలు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే.. జలవివాదంపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయాలని మంత్రి బాలినేని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement