Thursday, March 28, 2024

ఆస్పత్రుల వద్ద గలాటా చేయడం ఎందుకు?: మంత్రి ఆళ్ల నాని

కరోనా బాధితులకు అండగా నిలచేందుకు టీడీపీ నేతలు చేపట్టిన  బాధితులకు భరోసా కార్యక్రమంపై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్రంగా స్పందించారు. కరోనా నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూ, పాజిటివిటీ రేటు తగ్గిస్తున్నామని మంత్రి ఆళ్ల నాని అన్నారు. తెలుగుదేశం నాయకులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని  మండిపడ్డారు. ఆస్పత్రుల వద్ద హైడ్రామా చేయడంతో వారికొచ్చే లాభం ఏమిటో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ఆస్పత్రుల వద్ద గలాటా చేసి సీఎం జగన్‌ పై బురద జల్లాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.

టీడీపీ నేతల పిల్ల చేష్టలు,  అల్లరి చేష్టలు చూసి ప్రజలు సిగ్గుతో తలవంచుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్‌లు హైదరాబాద్‌లోని రాజప్రసాదాల్లో ఉంటూ జూమ్ కాన్ఫరెన్స్‌లు,  వీడియో కాన్ఫరెన్స్‌లతో హడావిడి చేస్తున్నారని విమర్శించారు.  కరోనాపై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు అసెంబ్లీకి రాకుండా బాయ్ కాట్ చేసారని మంత్రి ప్రశ్నించారు. ఒకరోజు జరిగిన అసెంబ్లీని ఎగ్గొట్టి హైదరాబాద్‌లో కూర్చుని కాలక్షేపం కబుర్లు చెప్పారని మంత్రి ఆళ్ల నాని విమర్శించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement