Saturday, April 20, 2024

మామిడి పండు పుల్లన, తగ్గిన దిగుబడి.. పెరిగిన ధర..

కర్నూల్‌, ప్రభన్యూస్ : మెరిసే పసుపు వర్ణం. అతిమధురం తీయటి గుణం. నోరూరించే పచ్చళ్ళకు ప్రసిద్ధి మామిడి. మామిడిని చూడగానే ప్రతిఒక్కరు ఇష్టపడటం సహజం. పండ్ల రకాల్లో అంతటి విశేష సహజగుణం కలిగిన మామిడి ప్రస్తుతం సామాన్యుడికి అందుబాటులో లేవు. ప్రస్తుతం మార్కెట్లో మామిడికి ఎక్కువ ధర పలకడం ఇందుకు కారణం. కర్నూలు మార్కెట్‌ లో 100 మామిడి పండ్లు రూ.1500 నుంచి 3 వేల వరకు ధర పలుకుతుండగా, అంత ఖరీదు చెల్లించలేని మామిడి పండ్లను తినలేని సామాన్యులు అందరి మామిడి పుల్లన అంటూ పెదవి విరుస్తున్నారు. మామిడి పండ్ల ఉత్పత్తిలో, ఎగుమతిలో మొదటినుంచి మన దేశంది అగ్రస్థానం. సాలీనా ప్రపంచదేశాల్లో ఏటా 170 లక్షల మెట్రిక్‌ టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుండగా, ఇందులో ఒక్క భారతదేశంలోనే ఏటా దాదాపు 110 లక్షల మెట్రిక్‌ టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ వర్గాల గణన. మన రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల నుంచి మూడు లక్షల హెక్టార్లలో మామిడి సాగు అవుతుండగా, విస్తీర్ణంలో దేశంలోనే రెండో స్థానంలో ఉంది. అంటే మామిడి ఉత్పత్తిలో మన రాష్ట్రాన్రికి 24 శాతం వాటా కలిగి ఉన్నప్పటికీ ఎగుమతుల విషయానికి వస్తే 15 నుంచి 16 శాతం కలిగి ఉంది.

దళారుల దందా..

మామిడి ధరలు అమాంతంగా పెరిగేందుకు వాతావరణంలో మార్పులు ఒక కారణమైతే, మరో కారణం మార్కెట్కు వచ్చే మామిడి ఉత్పత్తులను కార్పొరేట్‌ సంస్థలు తన్నుక పోవడమే. ముఖ్యంగా ఇటీవల కార్పొరేట్‌ సంస్థలు మామిడి పండ్ల రసాలు పేరుతో పలు సంస్థలు తమ ఉత్పాదకతను సాగిస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీలు మార్కెట్కు వచ్చే పండ్లను తరలించేందుకు ధర ఎంతైనా చెల్లించేందుకు వెనుకాడటం లేదు. దీంతో దళారులు మార్కెట్కు వచ్చే సరుకును అటు నుంచి అటే తరలిస్తుండగా, మార్కెట్లో మాత్రం వీటి మూలంగా ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం మార్కెట్లో ఒక డజను మామిడి పండ్లు ధర కొనుగోలు చేయాలంటే రూ.300 నుంచి 500 వరకు చెల్లించాల్సి వస్తుంది.

మన జిల్లాలలో పండించే మామిడిని ఎక్కువగా రాష్ట్ర రాజధాని మార్కెట్తో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్‌ తదితర రాష్ట్రాల్రకు తరలిస్తున్నారు పక్క రాష్ట్రాల్రకు తరలించడం వల్ల స్థానికంగా మామిడి ధరలకు రెక్కలు వచ్చాయి. వాస్తవంగా మామిడి సీజన్‌ వస్తే మన జిల్లాలో వందల మందికి ఉపాధి దొరుకుతుంది. మామిడి పంటల ఉత్పత్తుల వల్ల విక్రయాల వద్ద నుంచి పచ్చళ్ల తయారీ వరకు కాసులు కురిపిస్తోంది. మన జిల్లాలో మామిడి పంట సీజన్లో వివిధ ప్రాంతాలనుంచి పట్టణాలకు వలస వచ్చే రైతులు పెద్ద ఎత్తున విక్రయాలు సాగిస్తారు. ముఖ్యంగా కర్నూలు నగరంలో మామిడి విక్రయించే వారిలో రైతులే అధికంగా ఉంటారు. ఒక్క మామిడి సీజన్‌లోనే వీరు లక్ష నుంచి రెండు లక్షల వరకు వ్యాపారం చేస్తరాన్న అంచనా. అయితే గత ఏడాది కరోనా, ఈ ఏడాది మామిడి ఉత్పత్తులు తగ్గడం, కార్పొరేట్‌ సంస్థల హ‌వా సాగించడం, దళారుల దందాతో మామిడి ధరలు అమాంతంగా పెరిగి సామాన్యునికి అందుబాటులో లేకుండా పోయాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement