Saturday, February 4, 2023

పొరుగు రాష్ట్రాల మద్యం.. ఆ కిక్కే.. వేరప్పా

ఒంగోలు, ప్రభన్యూస్‌ : మన మద్యం రేటెక్కువై.. ఘాటెక్కింది. ధరలు రెట్టింపైనా.. కావాల్సిన బ్రాండ్‌ కరువైంది! దీంతో దిక్కుతోచని స్థితిలో మందుబాబులు పొరుగు రాష్ట్రాల మద్యం వైపు చూస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న మద్యంలో నచ్చిన బ్రాండ్లు.. పైగా తక్కువ ధరకే దొరుకుతోంది..! ఇదే అదునుగా చూసుకోని కొందరు సైడ్‌ బిజినెస్‌గా పొరుగు రాష్ట్రాల మద్యం వ్యాపారాన్ని సాగిస్తున్నారు. గోవా నుంచి రూ. 3.52లక్షల రూపాయలు విలువ చేసే 6,120 మద్యం బాటిళ్లను కంటైనర్‌లో తరలిస్తున్న ఎస్‌ఈబీ అధికారులకు సమాచారం రావడంతో దాడి చేసి పట్టుకున్నారు. కంటైనర్‌ను ఎవరైనా తనిఖీ చేసినా ఎటువంటి అనుమానం రాకుండా అక్రమార్కులు జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. కంటైనర్‌ తలుపులు తెరిచి చూస్తే.. ముందుగా రొయ్యలు, చేపలు ఎగుమతికి ఉపయోగించే ప్లాస్టిక్‌ బాక్సులు కనిపించే విధంగా పేర్చారు. మధ్యలో మద్యం బాక్సులు పెట్టి తరలిస్తున్నారు.

- Advertisement -
   

ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు..కాసులు కురిపిస్తే చాలనుకుంటున్న మాఫియా పట్టణాల నుంచి పల్లెకు విస్తరించింది. కొందరు అక్రమార్కులు కార్లు, కంటైనర్లు, మోటార్‌సైకిళ్ల ద్వారా మద్యాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఒంగోలు శివారు ప్రాంతాలతో పాటు, ఆర్టీసీ బస్టాండ్‌, బండ్లమిట్ట ప్రాంతాల్లో నుంచే మద్యం అమ్మకాలు సాగుతున్నట్లు సమాచారం. కొందరు రాజకీయ నాయకుల అండదండలతో తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి ఏజంట్ల ద్వారా అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం. ఒంగోలు నగరంలో ప్రతి రోజూ రూ.లక్షల రూపాయల తెలంగాణ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఆ బ్రాండ్‌, ఈ బ్రాండు అనేది కాకుండా ఏ బ్రాండు కావాలన్నా.. ఠంచన్‌గా తెచ్చి ఇస్తుండటం విశేషం. రూ.లక్షల అక్రమ మద్యం వ్యాపారం మూడో కంటికి తెలియకుండానే సాగిపోతోంది.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement