Tuesday, April 23, 2024

కేంద్ర హోంశాఖకు టీడీపీ ఎంపీల లేఖలు.. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి.

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతీకార రాజకీయాలకు, కక్షసాధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, కే. రామ్మోహన్ నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు విడివిడిగా లేఖలు రాశారు. మాజీ మంత్రి నారాయణ అరెస్టు, ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు బెదిరింపులు సహా పలు అంశాలను ఈ లేఖల్లో ప్రస్తావించారు. అధికార వైఎస్సార్సీపీ నేతలు రాజకీయ ప్రత్యర్థులైన తెలుగుదేశం నేతలపై కక్షసాధింపు చర్యలకుపాల్పడుతూ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆర్టికల్ 19, 21ను ఉల్లంఘిస్తూ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా మీడియా సమావేశంలోనే అంగీకరించారని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌ సహా ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను సైతం ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ భారత టెలీగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5(2)తో పాటు ఐటీ యాక్ట్, 2000లో ని సెక్షన్ 69ను కూడా ఉల్లంఘించినట్టేనని ఎంపీలు తమ లేఖలో పేర్కొన్నారు. ఫోన్ల ట్యాపింగ్ ప్రజాస్వామానికే కాక దేశ భద్రత, సమగ్రతకు కూడా ముప్పు కల్గిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్‌పై వెంటనే విచారణ జరిపించాలని కోరారు.

నారాయణ అరెస్టులో ఉల్లంఘనలు..

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌కు రాసిన లేఖలో మాజీ మంత్రి నారాయణ అరెస్టు అంశాన్ని ప్రస్తావించారు. స్థానిక పోలీసులకు, కుటుంబ సభ్యులకు అరెస్టు సమాచారం ఇవ్వకుండా, నిబంధనలు ఏమాత్రం పాటించకుండా అరెస్టు చేశారని ఆరోపించారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉల్లఘించారని విమర్శించారు. ప్రత్యేకించి చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి పాత్ర అత్యంత అనుమానస్పందంగా ఉందని అన్నారు. అధికార పార్టీకి కొమ్ముకాసేలా, నారాయణను కావాలని ఇరికించేలా రిషాంత్ రెడ్డి పనిచేశారని లేఖలో ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుని రిషాంత్ రెడ్డి సహా బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement