Thursday, November 7, 2024

AP | విశాఖ ఉక్కు కాపాడుకుందాం : డిప్యూటీ సీఎం పవన్

’32 మంది బలిదానాలు, 16 వేల మంది నిర్వాసితుల త్యాగాలు, 24 వేల ఎకరాలు భూ సేకరణతో ఏర్పాటైన పరిశ్రమ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌. ఈ పరిశ్రమ కోసం అంతమంది చేసిన త్యాగాలను ఎవరూ మరచిపోకూడదు. వారి త్యాగాలతో ఏర్పడిన పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేగం ప్లాంట్‌లో పనిచేసే ప్రతి ఒక్కరితోపాటు కార్మిక, ఉద్యోగ సంఘాల నేతల్లో కూడా ఉండాలి’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

ఈ పరిశ్రమను కాపాడుకొనేందుకు కార్మికులు, ఉద్యోగులు, భూ నిర్వాసితులు తెలియచేసిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఆదివారం సాయంత్రం విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన వివిధ కార్మిక సంఘాలు, ఉక్కు పరిరక్షణ సంఘాల ప్రతినిధులు పవన్‌ కల్యాణ్‌తో సమావేశమయ్యారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ కాకుండా కాపాడాలని కోరారు. 12,500 మంది ఉద్యోగులు, 14 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు ఉన్నారని, వారికి కొద్ది నెలలుగా అలవెన్సులు కూడా అందటం లేదని తెలిపారు.

- Advertisement -

ఆ రోజే అందరూ కలసి వచ్చి ఉంటే…

పవన్‌ కల్యాణ్‌ స్పందిస్తూ ”పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్స్‌ బతకాలని కోరుకొనేవాడిని. అలాగే సహకార విధానంలో ఉన్నవి నిలబడాలని ఆకాంక్షిస్తాను. విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్ళి మాట్లాడాము.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాని కలిసి ఎన్ని త్యాగాలు, పోరాటాలతో ఈ పరిశ్రమ ఏర్పాటైందో తెలిపాము. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ దగ్గర సభ నిర్వహించి ఉద్యోగ, కార్మిక సంఘాలు అన్నీ ఒక తాటిపైకి వచ్చి అఖిల పక్షంతో కేంద్రం దగ్గరకు వెళ్ళి విజ్ఞాపన ఇద్దాము అని చెబితే ఎవరూ ముందుకు రాలేదు.

ఆ రోజే అందరూ కలసి వచ్చి ఉంటే ఇప్పుడు ఇంత ఆందోళన చెందాల్సి ఉండేది కాదు. ప్రస్తుతం మీ ఆందోళనను కేంద్ర ప్రభుత్వానికి తెలియచేస్తాము. విశాఖ ఉక్కును నిలబెట్టుకొనేందుకు కార్మిక, ఉద్యోగ సంఘాల తరఫున మీరు చేసే ప్రతిపాదనలు వివరించాలి.

అదేవిధంగా మన వైపు నుంచి ఉన్న ఇబ్బందులను కూడా మనం తెలుసుకొని సరిదిద్దుకోవాలి” అని సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసే వివరాలపై వారితో చర్చించి నివేదికను రూపొందించారు. ఈ సందర్భంగా డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ను ప్రయివేటీకరణ కాకుండా ఎలా కాపాడింది వివరించారు.

స్టీల్‌ ప్లాంట్‌ భూములు అమ్మేద్దామన్నారా?

ఈ సందర్భంగా చర్చల్లో పవన్‌ కల్యాణ్‌ కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడుతూ ‘నాటి ముఖ్యమంత్రి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భూములు అమ్మేద్దామని మీ ముందు ప్రతిపాదించిన మాట నిజమేనా?’ అని అడిగారు. ఆ ప్రతిపాదన వాస్తవమే అని ఆ నేతలు తెలిపారు.

ప్రతిపాదనలివే..

విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఉన్న ముఖ్య ప్రతిపాదనలపై కార్మిక సంఘాల నేతలతో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చర్చించారు. ఈ సందర్భంగా 4 ముఖ్య ప్రతిపాదనలను తెలిపారు.

  1. విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలి. వర్కింగ్‌ క్యాపిటల్‌ సమకూర్చాలి. లేదా
  2. సెయిల్‌లో విలీనం చేయడం. లేదా
  3. ఎన్‌ఎండీసీ, నగర్‌ నార్‌ స్టీల్స్‌లో విశాక ఉక్కును విలీనం చేయాలి.
  4. నాన్‌ స్ట్రాటజిక్‌ ప్లాన్‌ నుంచి స్ట్రాటజిక్‌ ప్లాన్‌ పరిధిలోకి విశాఖ ఉక్కును తీసుకోవాలి.

సమావేశంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌, ఐఎన్‌టీయూసీ, బీఎంఎస్‌, సీఐటీయూ, ఎగ్జిక్యూటివ్‌ అసోసియేషన్‌, టీఎన్‌టీయూసీ, డీఎస్‌యూ, యూఎస్‌ఈ, వీఎంఎస్‌ యూనియన్‌, యూత్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ- ప్రతినిధులు, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, భీమిలి పార్టీ ఇన్‌చార్జ్‌ పంచకర్ల సందీప్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement