Thursday, March 28, 2024

గుండ్ల బ్రహ్మేశ్వరంలో చిరుత పులి మృతి.. పెద్దపులి, చిరుత మధ్య కొట్లాట

బండిఆత్మకూరు, ప్రభన్యూస్ : మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతం గుండ్ల బ్రహ్మేశ్వరం రేంజ్‌ పరిధిలో చిరుత పులి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుండ్ల బ్రహ్మేశ్వరం రేంజ్‌లోని ముస్తఫా రస్తా సెంట్రల్‌ నల్లమల రోడ్డు సమీపంలో ఈ ఘటన జరిగినట్లు గుండ్ల బ్రహ్మేశ్వరం రేంజ్‌ ఇన్‌ఛార్జి రేంజర్‌ నాసిర్‌ జాహ్‌ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో అక్కడ పెద్దపులి, చిరుత పులి మధ్య ఘర్షణ జరిగినట్లు చెప్పారు. ఈ ఘర్షణలో పెద్దపులి చిరుత పులి పై దాడి చేసి చిరుత పులిని ఎక్కడపడితే అక్కడ కొరకడంతో చిరుత మృతి చెందినట్లు రెంజర్‌ తెలిపారు. చిరుత పులిఫై పెద్దపులి దాడి చేసిన గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రెంజర్‌ స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న నంద్యాల డిఎఫ్‌వో వినీత్‌ కుమార్‌, ఇతర అటవీ అధికారులతో కలిసి అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుత పులి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు.

అనంతరం వెలుగోడు మండలం మోతుకూరు పశువైద్యాధికారి సుధాకర్‌ రెడ్డి, నాగార్జునసాగర్ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ వైద్యాధికారులు జుబేర్‌లు మృతి చెందిన చిరుతకు పోస్టుమార్టం నిర్వహించి అక్కడే కననం చేసినట్లు- రేంజర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement