Thursday, March 28, 2024

కర్నూలు జిల్లాకు వైసీపీ ద్రోహం : సీపీఎం నేత గౌస్ దేశాయ్

విశాఖ ఒకటే రాజధాని కర్నూల్ లో హైకోర్టు కాదు బెంచ్ మాత్రమే అని ఆర్థిక మంత్రి ప్రకటించడం కర్నూలు జిల్లా ప్రజలకు ద్రోహం చేయడమేనని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ తెలిపారు. ఆర్థిక మంత్రి బుగ్గన తన ప్రకటనను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇన్నాళ్లు పాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల పాట పాడుతున్న వైసీపీ ప్రభుత్వం అసలు రంగు బయటపడిందని ఆయన విమర్శించారు. రాయలసీమ మహా గర్జన పేరుతో సభలు పెట్టి ప్రజలను మోసం చేసిన నాయకులు ఈరోజు ఎక్కడికి వెళ్లారు, ఈ ప్రభుత్వం ప్రకటించిన ప్రకటన చూసైనా మేల్కొనండి అని ఆయన హితవు పలికారు. మూడు రాజధానులు అంటూ ఏమీ లేవని రాష్ట్రానికి విశాఖ ఒక్కటే ఏకైక రాజధాని అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పడం దారుణమని ఆయన తెలిపారు. కర్నూల్ కు న్యాయ రాజధాని అని సంకలు గుద్దుకుని చెప్పిన వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రి ప్రకటనపై ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని, లేకపోతే తమ ఎమ్మెల్యేల పదవీలకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటకలో ధార్వాడ్లో ఒక బెంచ్ గుల్బర్గాలో మరో పెంచుకున్నట్లు కర్నూల్ లో ఒక బెంచ్ మాత్రం ఏర్పాటు చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. కర్నూలు జిల్లా ప్రజలు వైసిపి ప్రభుత్వం అసలు రంగు బయటపడిన తర్వాత అయినా మేల్కొనాలని ఆయన తెలిపారు. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినప్పుడు కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండి వైసిపి నాయకులు కర్నూలు జిల్లాకు ద్రోహం చేశారని, మళ్లీ కర్నూల్ లో హైకోర్టు కాదు బెంచ్ అని మరొకసారి ద్రోహం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కర్నూలు జిల్లా ప్రజల ఓట్లు వేయించుకోవడం తప్ప ఈ జిల్లా ప్రజలకు ఏమి చేయకుండా ఉండాలనే ధ్రుడమైన నిశ్చయంతో వైసిపి ప్రభుత్వం ఉందని చాలా స్పష్టంగా అర్థం అవుతుందని ఆయన ఘాటుగా విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు వైసిపి ప్రభుత్వ అసలు రంగును గుర్తించి న్యాయ రాజధాని కోసం, అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం ఆపడం కోసం ఉద్యమాలకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement