Tuesday, April 23, 2024

దంచికొడుతున్న ఎండలు.. ఉపాధి పనుల్లో కూలీలకు శానా కష్టం..

కర్నూలు : జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలను సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా అధిక ఎండలు, సమస్యలేమితో జిల్లాలో పనులు మందకొడిగా సాగుతున్నాయి. వాస్తవంగా ప్రతి కూలీ కుటుంబానికి ఉపాధి హామీ కింద పనికల్పించి. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం, వీటిద్వారా గ్రామీణ ప్రాంతంలో సుస్థిర అభివృద్ది, సహాజ వనరులను మరింత పెంచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో భాగంగా జిల్లాలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌లు, బల్క్‌మిల్క్‌ కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రేరీలతో పాటు 2022- 23 ఆర్ధిక సంవత్సరంలో పథకం కింద రూ. 770 కోట్లను వ్యయం చేసేందుకు పనులు మొదలు పెట్టారు.ఈ నిధులతో ప్రధానంగా చెరువులు, పంటకాల్వలు, కుంటలలో పూడిక తీత తదితర పనులను నిర్వహిస్తున్నారు. వీటితో పాటు ప్రతి నియోజక వర్గంలో రూ. 15.20 కోట్ల సిసి రోడ్లు వేసేందుకు నిధులు వ్యయం చేస్తున్నారు. ఇక నాడు. నేడు కింద పనులను సైతం చేపడుతున్నారు. ఇప్పటికే పొలంగట్లు, పండ్ల మొక్కలు, ఉద్యాన పంటలు, చెరువుల పూడిక తీత, కందకాలు, పంట కాల్వల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఆయా పనులను ఎక్కువగా జిల్లాలో వలస ప్రాంతాలైన పశ్చిమ ప్రాంతంలో నిర్వహాణకు ప్రణాళికలు చేశారు. ఇందుకోసం ఒక్కొక్క గ్రామంను యూనిట్‌గా తీసుకున్నారు. కర్నూలు జిల్లాలో ప్రధానంగా పత్తికొండ, ఆదోని, ఆలూరుతో పాటు డోన్‌ నియోజక వర్గ పరిధిలో ఎక్కువగా పనులు గుర్తించారు. ఉపాధి కింద ప్రస్తుతం 100 రోజులు పనికల్పిస్తుండగా, వీలును బట్టి వీటిని 150 రోజులకు పెంచనున్నారు. ఇందులో అటవీశాఖ, ప్రయివేట్‌ నర్సరీలలో మొక్కలు కొనుగోలు చేసి నూతన నర్సరీలను ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటితో పాటు బనవాసి, కాల్వబుగ్గ, మరో నర్సరీ ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఉపాది హామీ కింద ప్రస్తుతం చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. పూడిక మట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకుంటున్నారు. కొన్నిచోట్ల కుంటల్లో తవ్విమట్టిని కట్టకుపోసి బలోపేతం చేస్తున్నారు. కట్టలపై ముళ్ల పొదలు చెట్లు తొలగిస్తున్నారు. వరద కాలువలు, నర్సరీ పనులు, రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ భూములను చదును చేస్తున్నారు. అంతేకాదు వర్షపు నీటిని నిల్వచేసి బావులు, బోర్లలో భూగర్భ జలాలను పెంచేందుకు సరిహద్దు కందకాలు తవ్వుతున్నారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ, వ్యవసాయ బావుల వద్దకు రహదారుల నిర్మాణం తదితర పనులు ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్నాయి.

జిల్లాలో 2.61 లక్షల మంది పనులకు హాజరు :

ఉమ్మడి జిల్లాలో గ్రామీణ ఉపాధి హామి పథకం కింద 9.80 లక్షల మందికి జాబ్‌ కార్డులు ఉన్నాయి. ఇందులో 5.85 లక్షల మంది ఉపాధి కూలీలు పనులకు హాజరవ్వాల్సి ఉంది. మే మాసంలో దాదాపు 3.50 లక్షల మందికి ఉపాది పనులు కల్పించాలి. కాని జిల్లాలో మాత్రం ఉపాధి పనులకు ప్రస్తుతం 2.61 లక్షల మంది హాజరవుతున్నట్లు అధికారిక లెక్కలను బట్టి వెల్లడవుతుంది. వాస్తవంగా శిరివెళ్ల మండలంలో 9155 మందికి జాబ్‌ కార్డులు ఉండగా, కేవలం 4600 మంది మాత్రమే కూలీకి వస్తున్నారు. తుగ్గలి మండలంలో 22,500 జాబ్‌ కార్డులు ఉండగా, కేవలం 10620 మంది మాత్రమే వస్తున్నారు. మంత్రాలయంలో 10వేలకు పైగా జాబ్‌ కార్డులకు గాను కేవలం 5200 మంది, ఎమ్మిగన్నూరులో 17258 మందికి గాను, 5128 మంది, ఆస్పరిలో 19568 మందిగాను 4285, గూడూరులో 600 మందికి గాను 4020, నందవరంలో 17528 మందికి గాను 5128, బండి ఆత్మకూరులో 5000, పాములపాడులో 18686కు గాను 3542, సి.బెల్‌గల్లో 21వేలకు గాను, 6500, అవుకు మండలంలో 14035 మందికి గాను 4200, హోళగుందలో 14415 గాను 5374, పాణ్యంలో 12వేలకు గాను 4500 మంది, గోస్పాడులో 9347 గాను, 4700 మంది మాత్రమే ఉపాది పనులకు హజరవుతున్నట్లు గుర్తించారు. మిగిలిన ప్రాంతాల్లో కూడ ఇదే పరిస్ధితి ఉంది. వాస్తవంగా కూలీలుగా పనిచేసే వారికి సగటు వేతనం కింద రూ. 257 చెల్లించాల్సి ఉంది. ఏ మాత్రం సగటు వేతనం రూ. 180 మాత్రమే కూలీలకు అందుతుంది. ఉపాధి కూలీలకు వేసవిలో పనిచేస్తే ఆధనంగా వారికి గతంలో సమ్మర్‌ అలవెన్స్‌లు కూడా వచ్చేవి. మార్చి, ఏప్రెల్‌, మే, జూన్‌ మాసాలకు ప్రతి ఏడాది సమ్మర్‌ అలవెన్స్‌ కింద ముందుగానే సర్కులర్‌ ఇచ్చి ఉపాధి కూలీలకు వారు చేసిన ప్రతిరోజు పనికి అలవెన్స్‌ కింద మంజూరు చేసేవారు. కూలీలు పనులకు వెళ్తే కేవలం వేతనం మాత్రమే తీసుకుంటున్నారు. ఇక ఉపాధి పనులు జరుగుతున్నచోట తగిన సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల కూడ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎండవేడిమితో కూలీలు తట్టుకోలేక పోతున్నారు. వాస్తవంగా ఉపాది పనిచేసే చోట షామియానాలు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలి. అయితే ఇవేమి కనపడటం లేదు. వీటికి టెండర్లు పిలువగా, అడపదడప మాత్రమే సరఫరా చేశారు. పని ప్రదేశం బట్టి రవాణా ఖర్చులు, మంచినీటికి ఆధనంగా ఇచ్చేవారు, కాని ప్రస్తుతం ఇవ్వడం లేదు. గడ్డపారాలు, గంపలు సరఫరా లేవు. ఓఆర్‌ఎస్‌, మజ్జిగ ప్యాకేట్లను నిలిపివేశారు.

జిల్లాలో రూ. 30 కోట్ల వేతన బకాయిలు :

జిల్లాలో ఉపాధి హామికి సంబందించి దాదాపు రూ. 30 కోట్ల వరకు వేతన బకాయిలున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 5.85 లక్షల మంది ఉపాది జాబ్‌ కార్డులు, శ్రమ శక్తి సంఘాలు 55వేలకు పైగా ఉన్నాయి. అయితే ఉపాది పనులకు కేవలం 2.61 లక్షల మంది మాత్రమే హజరవుతున్నారు. మే చివరి నాటికి ఉపాధి కూలీల సంఖ్యను 4 లక్షలకు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే మండుటెండలో కష్టపడి పనిచేస్తున్న కూలీలకు సకాలంలో వేతనంలు అందడం లేదని ఎమ్మిగన్నూరు నందవరంకు చెందిన లక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలలో ఇదే పరిస్ధితి ఉంది. దీంతో కూలీలు ఉపాధి పనిపై అసక్తి చూపడం లేదు. కాని కొన్ని మండల ప్రాంతాల్లో మాత్రం ఉపాధి కూలీలు పనిచేసేందుకు ముందుకు వస్తున్న వారికి తగిన విధంగా పనులు చూపడం లేదు. మొత్తంగా జిల్లాలో ఉపాది హామి కింద రూ.30 కోట్ల వరకు వేతనాలు చెల్లించాల్సి ఉండగా, ఇందులో ఒక్క కర్నూలు జిల్లాలోనే రూ. 15.45 కోట్ల వరకు ఉంది. ఇక నంద్యాల జిల్లాలో 13.50 కోట్ల వరకు వేతనాలు చెల్లించాల్సి ఉం ది. అయితే బకాయి వేతనాలను త్వరలో చెల్లిస్తామని ఆ శాఖ పిడి అమర్‌నాథ్‌ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement